అమెరికాలో టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య: దోషికి యావజ్జీవ కారాగారం

First Published 5, May 2018, 7:17 AM IST
Techie Srinivas Kuchibhotla's killer sentenced to life
Highlights

తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య కేసులో దోషి అయిన అమెరికా నేవీ వెటరన్ ఆడం డబ్ల్యు పురిటన్ కు కోర్టు యావజ్జీవ కారాగారం విధించింది.

కాన్సాస్: తెలుగు టెక్కీ శ్రీనివాస్ కూచిభొట్ల హత్య కేసులో దోషి అయిన అమెరికా నేవీ వెటరన్ ఆడం డబ్ల్యు పురిటన్ కు కోర్టు యావజ్జీవ కారాగారం విధించింది. శ్రీనివాస్ కూచిభొట్ల జాతి వివక్ష హత్య అంతర్జాతీయ స్థాయిలో సంచలనం సృష్టించింది. 

మా దేశం నుంచి వెళ్లిపోండి అంటూ పురిటన్ అరుస్తూ శ్రీనివాస్ కూచిభొట్లపై, అతని మిత్రుడిపై ఒలాథే నగరంలోని బార్ లో కాల్పులు జరిపాడు. కూచిభొట్లను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. అతను మరణించాడు. ఆయన మిత్రుడు ఆలోక్ మాడసాని మాత్రం గాయాలతో బయటపడ్డాడు. 

పురిటన్ ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన అమెరికా పౌరుడు ఇయాన్ గ్రిల్లోట్ కూడా గాయపడ్డారు. ఘటనపై నోరు విప్పనందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర విమర్శలకు గురయ్యారు. అయితే, ఆ తర్వాత ఆమెరికా కాంగ్రెసులో ఆయన ఆ విషయంపై మాట్లాడారు. 

శ్రీనివాస్ కూచిభొట్ల భార్య సునయన దాములను డోనాల్డ్ ట్రంప్ తాను తొలి యూనియన్ ప్రసంగానికి ఆహ్వానించారు. పురిటన్ కు గరిష్ట శిక్ష పడింది. పురిటన్ పై ఫెడరల్ హేట్ క్రైమ్, ఆయుధాలకు సంబంధించిన అభియోగాలు కూడా ఉన్నాయి. ఈ కేసులో అతనికి మరణ శిక్ష పడే అవకాశం ఉంది. 

దోషికి శిక్ష విధించినంత మాత్రాన తన భర్త శ్రీను తిరిగి రాడని, అయితే ద్వేషం అంగీకారయోగ్యం కాదనే బలమైన సంకేతాలను తీర్పు ఇస్తుందని సునయన అన్నారు. 

హైదరాబాద్ లో పెరిగిన కూచిభొట్ల (33) టెక్సాస్ విశ్వవిద్యాలయంలో చదివేందుకు అమెరికా వచ్చాడు. ఆ తర్వాత ఇల్లు కొన్నాడని, పెళ్లి చేసుకున్నాడని సునయన చెప్పారు. 

కూచిభొట్ల, ఆలోక్ మాడసాని జిపిఎస్ మానుఫాక్చరర్ గార్మిన్ లో ఏవియేషన్ సిస్టమ్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు 

loader