పోస్టింగులు, బదిలీలకు  సంబంధించి అమలులో ఉన్న నిబంధనలతో ఉపాధ్యాయులు విభేదిస్తున్నారు. ప్రస్తుత నిబంధనలను మారుస్తామని స్వయంగా గంటానే గతంలో హామీ ఇచ్చినా అమలు కావటం లేదని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్నారు. రాజీనామా డిమాండ్ తో రాష్ట్రంలోని పలుప్రాంతాల నుండి పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు విశాఖపట్నంకు చేరుకున్నారు. అంతేకాకుండా గంటా ఇంటిని చుట్టుముట్టారు. దాంతో ఇంటి వద్ద పరిస్ధితి ఉద్రిక్తతంగా ఉంది.

ఉపాధ్యాయుల బదిలీలు, పోస్టింగలతో పాటు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారాన్ని కోరుతూ గంటా ఇంటని చుట్టుముట్టారు. ప్రస్తుతం పోస్టింగులు, బదిలీలకు సంబంధించి అమలులో ఉన్న నిబంధనలతో ఉపాధ్యాయులు విభేదిస్తున్నారు. ప్రస్తుత నిబంధనలను మారుస్తామని స్వయంగా గంటానే గతంలో హామీ ఇచ్చినా అమలు కావటం లేదని ఉపాధ్యాయులు మండిపడుతున్నారు.

బదిలీలు, పోస్టింగులకు సంబంధించి వెబ్ కౌన్సిలింగ్ పద్దతిని ఎత్తేయాలంటూ ఉపాధ్యాయులు ఎప్పటి నుండో డిమాండ్ చేస్తున్నారు. వెబ్ కౌన్సిలింగ్ బదలు ఆన్ లైన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. అందుకు మంత్రి కూడా హామీ ఇచ్చారు. హామీ అయితే, ఇచ్చారుకానీ అమలు చేయటం లేదు. విద్యా సంవత్సరం మొదలు కాబోతున్న తరుణంలో మళ్ళీ బదిలీలు, పోస్టింగుల గోల మొదలవ్వబోతోంది. దాంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన మొదలైంది. ప్రభుత్వం పాఠశాలలు మూసేయటాన్ని కూడా ఉపాధ్యాయులు వ్యతిరేకిస్తున్నారు. అందుకే ఉపాధ్యాయులు విశాఖ బాట పట్టారు.

ఎప్పుడైతే గంటా ఇంటిని ఉపాధ్యాయులు చుట్టుముట్టారో వెంటనే పోలీసులూ చేరుకున్నారు. ఇంటి ముందునుండి వెళ్ళిపోవాలని పోలీసులు చెప్పారు. అయితే, ఉపాధ్యాయ సంఘాలు వినకపోవటంతో పలువురు నేతలను పోలీసులు అరెస్టులు చేసారు. దాంతో పరిస్ధితి ఉద్రిక్తతంగా మారింది.