విద్యాబుద్ధులు నేర్పించి, విద్యార్ధులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువే.. మాయమాటలతో ప్రేమ పాటలు చెప్పి తల్లిని చేశాడు. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఆదిమూర్తిపల్లె గ్రామానికి చెందిన ఓ బాలిక కడప జిల్లా కలసపాడు మండలంలోని ఓ పాఠశాలలో 2017-18లో పదో తరగతి చదువుకుంది.

టెన్త్ అనంతరం తిరుపతిలోని ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. అయితే పదో తరగతి చదువుతున్నప్పుడు కడప జిల్లాకు చెందిన బొమ్మ  వీరయ్య అనే వ్యక్తి అదే పాఠాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు.

ఈ క్రమంలో బాలికపై కన్నేసిన అతను ప్రేమిస్తున్నాని, పెళ్లి చేసుకుంటానని ఆమె వెంటపడ్డాడు. అతని వలలో చిక్కుకున్న బాలిక.. గతేడాది దసరా సెలవులకు ఇంటికి వచ్చింది. ఈ క్రమంలోనే స్నేహితుని సహకారంతో ఆమెను ఇంటి నుంచి తీసుకెళ్లాడు.

బాలిక తనతో పాటు ఇంట్లో ఉన్న 32 తులాల బంగారు ఆభరణాలు, రూ.65 వేల నగదు తీసుకెళ్లింది. దీంతో యువతి తల్లిదండ్రులు అదే రోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్నప్పటికీ పట్టించుకోలేదు.

బాలికను సికింద్రాబాద్‌ తీసుకెళ్లిన వీరయ్య అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకుని భార్యా,భర్తల్లా కాపురం చేశారు. ఫలితంగా బాలిక గర్భందాల్చింది.

తొమ్మిది నెలలు గడుస్తున్నా తమ బిడ్డ ఆచూకీ లభించకపోవడంతో జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ ఆదేశాల మేరకు గిద్దలూరు పోలీసులు సికింద్రాబాద్ చేరుకుని బాలికను, వీరయ్యను అదుపులోకి తీసుకుని స్వగ్రామానికి తీసుకొచ్చారు.

తొమ్మిది నెలల తర్వాత అదృశ్యమైన తమ బిడ్డ.. ఆరు నెలల గర్భవతిగా ఇంటికి రావడంతో తల్లీదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. వీరయ్యపై ఫోక్సో చట్టంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు... బాలికను ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.