గుంటూరు జిల్లా, బెల్లంకొండలో ఓ కీచక టీచర్ నైచ్యానికి ఓడిగట్టాడు. విద్యార్థుల్ని సన్మార్గంలో పెట్టాల్సిన ఉపాధ్యాయుడే ఓ మహిళపై అసభ్యంగా ప్రవర్తించిన ఘటన బెల్లంకొండ మండలం న్యూ చిట్యాల గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. 

వివరాల్లోకి వెడితే గ్రామానికి చెందిన బొల్లా శ్రీనివాసరావు గవర్నమెంట్ స్కూల్ లో టీచర్ గా పని చేస్తున్నాడు.ఇంటింటికీ వెళ్లి నిమ్మకాయలు విక్రయించే ఓ మహిళతో నీచానికి దిగజారాడు. అదే గ్రామానికి చెందిన ఆమె శనివారం సాయంత్రం తన వ్యాపారం ముగించుకుని ఇంటికి వస్తున్న టైంలో టీచర్ శ్రీనివాసరావు ఆమె కొంగు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. 

దీంతో ఆమె ఆగ్రహంతో అతన్నుండి విడిపించుకుని ఇంటికి వెళ్లిపోతుంటే.. శ్రీనివాసరావు ఆమె వెంటపడ్డాడు. ఆమెతో పాటు ఆమె ఇంటికి వెళ్లీ మళ్లీ అసభ్యంగా ప్రవర్తించాడు. 

అంతేకాదు నీ పిల్లలకు చదువు చెబుతా.. కోర్కె తీర్చకుంటే నీ పిల్లల భవిష్యత్తు నాశనం చేస్తా.. నన్నే వద్దంటావా? అని ఆమెతో ఘర్షణ పడి అడ్డు వచ్చిన ఆమె తల్లిదండ్రులను కొట్టి వెళ్లిపోయాడు. 

దీంతో ఆదివారం ఆమె కుటుంబ సభ్యులు బెల్లంకొండ క్రాస్ రోడ్ దగ్గర ఆ టీచర్ ను  వెంటనే విధుల్లోనుంచి తొలగించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. అక్కడి ఎస్సై రాజేష్ బాధిత కుటుంబ సభ్యులకు నచ్చచెప్పి, బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.