ఇటీవలి కాలంలో ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా  ఇటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజగా స్కూల్‌లో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు.

బాపట్ల: ఇటీవలి కాలంలో ఉన్నట్టుండి గుండెపోటుతో మరణించే వారి సంఖ్య పెరిగిపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో కొంతకాలంగా ఇటువంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. తాజగా స్కూల్‌లో పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలి మరణించాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. బాపట్ల జిల్లాలోని ఇంకొల్లుకు చెందిన వీరబాబు వాకావారిపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తున్నారు. రోజు మాదిరిగానే శనివారం కూడా వీరబాబు పాఠశాలకు వచ్చారు. 

అయితే యథావిథిగా రోజులాగే విద్యార్థులకు పాఠశాలు చెబుతున్న సమయంలో వీరబాబుకు గుండెపోటు వచ్చింది. దీంతో కుప్పకూలిపోయి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో విద్యార్థులు పాఠశాలలలో ఇతర ఉపాధ్యాయులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇతర టీచర్లు వెంటనే 108 కాల్ చేశారు. అయితే 108 సిబ్బంది అక్కడికి చేరుకుని.. చికిత్స అందించేందుకు ప్రయత్నించగా వీరబాబు అప్పటికే మృతిచెందినట్టుగా గుర్తించారు. ఈ ఘటనతో పాఠశాలలో, వీరబాబు కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పలువురు విద్యార్థులు, టీచర్లు.. వీరబాబు మరణంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. 

ఇదిలా ఉంటే.. గత కొద్దిరోజులుగా వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుతో చనిపోతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు. వెంటనే ఆస్పత్రులకు తరలించినా లాభం లేకుండా పోతుంది. పెళ్లిలో డ్యాన్స్ చేస్తున్న ఓ యువకుడు, జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా కానిస్టేబుల్.. ఇలా పలువురు గుండెపోటుతో మరణించడంతో ఇప్పుడు ఆ పదం వింటేనే జనాల్లో భయం నెలకొంది.