కీచకపర్వం కొనసాగింపులో టిడిపి నేతలు చివరకు మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ నేతల కుటుంబసభ్యులను కూడా వదలటం లేదు. వ్యక్తిగతకక్ష సాధింపుల్లో భాగంగా ఓ టిడిపి నేత అనుచరుడు భాజపా నేత భార్య చీరను లాగేయటం చిత్తూరు జిల్లాలో సంచలనంగా మారింది. ఇంతకీ జరిగిందేమిటంటే, శుక్రవారం రాత్రి టీడీపీ నేత అనుచరుడు చిత్తూరు నగరంలో ఓ వివాహిత చీర లాగి అవమానించాడు. అడ్డు వచ్చిన ఆమె భర్తపై దాడి చేసి గాయపరిచాడు.

బాధితుల కథనం మేరకు, బీజేపీ జిల్లా మజ్దూర్‌ మోర్చా అధ్యక్షుడు గుత్త ప్రభాకర నాయుడుకు టిడిపి నేత హరిప్రసాద్ నాయుడుకు వ్యాపార గొడవలున్నాయి. టిడిపి నేత చిత్తూరులోనే మద్యం దుకాణాలు, బస్సులు నడుపుతున్నాడు. ఈ వ్యాపారాల్లో భాజపా నేతకు కూడా భాగస్వామ్యముంది. వ్యాపార లావాదేవీల్లో కొంతకాలంగా ఇద్దరి మధ్య వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ నేతకు బీజేపీ నేత లీగల్‌ నోటీసులు పంపారు. దీనిపై ఆగ్రహించిన టీడీపీ నేత తన అనుచరుడు, పార్ట కార్యకర్త వెంకటకృష్ణమ నాయుడును రెచ్చగొట్టి ప్రభాకర నాయుడు ఇంటిపైకి పంపాడు. 

శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆఫీసర్స్‌ లైన్‌లోని ప్రభారకర నాయుడి ఇంటికి వచ్చిన వెంకటకృష్ణమ నాయుడు పెద్ద గొడవే చేశాడు. ఇంటి మీదకొచ్చి అసభ్యంగా మాట్లాడడంతో ప్రభాకర్ దంపతులు వెంకటకృష్ణను మందలించారు. దాంతో  రెచ్చిపోయిన కార్యకర్త ప్రభాకర్ భార్య హారిక చీరకొంగు పట్టుకొని లాగాడు. అడ్డొచ్చిన ఆమె భర్తను గాయపరచటంతో పాటు హారికను కూడా గాయపరిచాడు. దాడిలో మోకాలికి గాయాలయ్యాయని ప్రభాకర్ దంపతులు చెప్పారు. ఈ మేరకు ఫిర్యాదు చేయగా వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.