టిడిపి మహిళా నాయకురాలు కళ్యాణి అరెస్ట్ సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేసారు వంగలపూడి అనిత.
అమరావతి : తెలుగుదేశం పార్టీ మహిళా నేత మల్పూరి కళ్యాణి అరెస్ట్ పై జాతీయ మహిళా కమీషన్ కు ఫిర్యాదు చేసారు తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. అర్ధరాత్రి బెడ్ రూంలోకి వెళ్లి కళ్యాణిని అరెప్ట్ చేయడం... కనీసం బట్టలు కూడా మార్చుకునేందుకు కూడా అనుమతివ్వకపోవడంపై లేఖలో పేర్కొన్నారు. ఇలా పోలీసుల తీరును తప్పుబడుతూ జాతీయ మహిళా కమీషన్ తో పాటు ఏపి డిజిపి కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డికి అనిత లేఖ రాసారు.
గన్నవరం టిడిపి కార్యాలయంపై వైసిపి గూండాలే దాడి చేసారని... అయినప్పటికి పోలీసులు వారిని వదిలేసి టిడిపి నేతలపైనే కేసు నమోదు చేసారని అనిత పేర్కొన్నారు. ఈ క్రమంలోనే కళ్యాణిపై కేసులు నమోదు చేసి బలవంతంగా ఇంట్లోంచి తీసుకెళ్లారని తెలిపారు.ఏప్రిల్ 10న హనుమాన్ జంక్షన్ లోని కళ్యాణి ఇంట్లోకి చొరబడ్డ పోలీసులు మహిళ అని కూడా చూడకుండా బెడ్రూం లోకి వెళ్లిమరీ అరెస్ట్ చేసారని అన్నారు. చివరకు దుస్తులు మార్చుకునేందుకు కూడా అనుమతించలేదని... తమ సమక్షంలోనే బట్టలు మార్చుకోవాలని బలవంతం చేస్తూ దారుణంగా వ్యవహరించారని అన్నారు. ఇది ఓ మహిళ వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును తీవ్రంగా ఉల్లంఘించడమేనని అనిత లేఖలో పేర్కొన్నారు.
Read More బెడ్రూంలోకి వెళ్లిమరీ టిడిపి మహిళా నేత అరెస్ట్... చంద్రబాబు సీరియస్ (వీడియో)
వైసిపి ప్రభుత్వం, పోలీసులు మహిళలపై నేరాలు కట్టడి చేయాల్సింది పోయి ప్రతిపక్ష టీడీపీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. పోలీసుల తీరుపై ఇప్పటికే రాష్ట్ర డిజిపికి అనేకసార్లు పిర్యాదు చేసామని... అయినా ఆయన నుండి ఎటువంటి స్పందన లేదన్నారు. ఈ నేపథ్యంలోనే కళ్యాణి అక్రమ అరెస్టు ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని... వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించిన పోలీస్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమీషన్ కు అనిత కోరారు.
గత మూడున్నరేళ్లలో డ్రగ్స్ నేరాలకు ఆంధ్రప్రదేశ్ కేంద్రంగా మారిందని అనిత ఆరోపించారు. మాదకద్రవ్యాల దుర్వినియోగంతో పాటు మహిళలపై నేరాలు, అఘాయిత్యాలు క్రమంగా పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసారు. వైసిపి ప్రభుత్వం పోలీసులను ఉపయోగించి నేరాల నియంత్రించాలి... కానీ ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుంటోందని అనిత ఆందోళన వ్యక్తం చేసారు.
గత ఫిబ్రవరి 20న అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నేతల మధ్య జరిగిన గొడవలో కల్యాణిపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో పోలీసులు అరెస్ట్ చేయకుండా వుండేందుకు ఆమె ముందస్తు బెయిల్ కు ప్రయత్నించింది. అయితే బెయిల్ లభించకపోవడంతో అరెస్ట్ నుండి తప్పించుకునేందుకు కల్యాణి అజ్ఞాతంలోకి వెళ్లింది. దీంతో ఆమె కోసం గాలిస్తున్న పోలీసులకు హనుమాన్ జంక్షన్ లోని నివాసంలో వున్నట్లు సమాచారం అందింది. దీంతో గత సోమవారం తెల్లవారుజామున పోలీసులు ఆ ఇంటిని ముట్టడించి కల్యాణిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో పోలీసులకు, కుటుంబసభ్యులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఓ మహిళను బెడ్రూం లోకి చొరబడి అరెస్ట్ చేయడం ఏమిటంటూ కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేసారు. కనీసం నైట్ డ్రెస్ కూడా మార్చుకునే అవకాశం ఇవ్వకుండా పోలీసులు అత్యంత దారుణంగా వ్యవహరించారని కల్యాణి కుటుంబసభ్యులు ఆరోపించారు.
కల్యాణి అరెస్ట్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. ''తెలుగు మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముల్పూరి సాయి కళ్యాణిపై తప్పుడు కేసు పెట్టిందే కాక.... బెడ్ రూంలోకి చొరబడి ఆమెను ఏదో ఉగ్రవాదిలా అరెస్టు చేసిన విధానం దారుణం. ప్రభుత్వ దుర్మార్గాలను ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం కేసు పెట్టి ప్రతాపం చూపడం సిగ్గుచేటు!'' అంటూ కల్యాణి అరెస్ట్ వీడియోను జతచేస్తూ చంద్రబాబు ట్వీట్ కూడా చేసారు.
