అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకొంది. వైసీపీకి ధీటుగా జేసీ సోదరులు చేసిన వ్యూహం ఫలించింది.

2019 ఎన్నికల్లో తాడిపత్రి అసెంబ్లీ నుండి పోటీ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు అస్మిత్ రెడ్డి, అనంతపురం ఎంపీ స్థానం నుండి పోటీ చేసిన జేసీ పవన్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యాడు. 

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత జేసీ సోదరులపై అనేక కేసులు నమోదయ్యాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డిలు జైలుకు వెళ్లి వచ్చారు. తప్పుడు పత్రాలతో వాహనాలను విక్రయించారనే కేసులో వీరిద్దరూ అరెస్టయ్యారు.

ఆ తర్వాత  కూడ మరో కేసులో జేసీ ప్రభాకర్ రెడ్డి మరోసారి జైలుకు వెళ్లి వచ్చాడు.   గత ఏడాది చివర్లో సోషల్ మీడియాలో తనకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టారనే  నెపంతో జేసీ ఇంటికి వెళ్లి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ వర్గీయులపై దాడికి దిగారు.

ఈ ఘటనతో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులతో పాటు కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గీయులకు మధ్య రాళ్ల దాడి చోటు చేసుకొంది.  ఈ ఘటన చోటు చేసుకొన్న తర్వాత మున్సిపల్ ఎన్నికలను జేసీ ప్రభాకర్ రెడ్డి సీరియస్ గా తీసుకొన్నారు.

మున్సిపాలిటీల్లో తన అభ్యర్ధులను బరిలోకి దింపారు. తాడిపత్రిలో మున్సిపాలిటీలో ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వైసీపీ ఏ రకంగా తనను ఇబ్బందులకు గురి చేసిందో అనే విషయాలను ఆయన ప్రచారం చేశారు

also read:తాడిపత్రిలో జేసీ గెలుపు: 24వ వార్డు నుండి జేసీ ప్రభాకర్ రెడ్డి విజయం

ఎన్నికల ప్రచారానికి చివరి రోజున కనీసం నడవలేని స్థితిలో కూడ ప్రభాకర్ రెడ్డి ప్రచారం సాగించారు. ఈ ఎన్నికలను టీడీపీ కార్యకర్తలు కూడ సీరియస్ గా తీసుకొన్నారు. దీంతో ఆ పార్టీ విజయం సాధించింది.తాడిపత్రిలో 36 వార్డులుంటే టీడీపీ 19, వైసీపీ 12, ఇతరులు రెండు స్థానాలను దక్కించుకొన్నాయి.