టిడిపి గెలిచిందంటే ఏం చేస్తే గెలుపు సాధ్యమైందో అర్ధం చేసుకోవచ్చు.
మామూలుగా అయితే జరిగిన ఎంఎల్సీ ఎన్నికల్లో ఆ మూడు జిల్లాల్లో గెలుపు సాధ్యం కాదు. మరేం చేయాలి. గెలుపు లక్ష్యంతో ఏం చేసైనా సరే విజయాన్ని అందుకోవాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. దాంతో గెలుపుకు సామధాన దండోపాయాలు ప్రయోగించింది అధికార టిడిపి.
గెలుగే లక్ష్యంతో టిడిపి అన్నీ అడ్డదారులూ తొక్కింది. వ్రతం చెడ్డా ఫలితమైతే దక్కించుకోగలిగిందనుకోండి అది వేరే సంగతి. ఎలాగైనా సరే కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో స్దానిక సంస్ధల ఎంఎల్సీ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబునాయుడు అనుకున్నారు. అందుకు తగ్గట్లే మంత్రులకు, అభ్యర్ధులకు, నేతలకు లక్ష్యాలను నిర్దేశించారు. ఓటర్లను ప్రలోభ పెట్టారు. భార్యా, భర్తల్లో ఎవరు ఓటర్లైతే వారికి డబ్బులు ఎరవేసారు. లొంగకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామని భయపెట్టారు. రెండోవారిపైనే కాకుండా వారి కుటుంబ సభ్యులపైన కూడా ఒత్తిళ్ళు తీసుకొచ్చారు.
గతంలో ఎన్నడూ అధికార పార్టీ పాల్పడని అనైతిక దారులను టిడిపి ఇపుడు తొక్కింది. కడప జిల్లాలో వైఎస్ కంచుకోటను బద్దలు కొట్టాలని, శాససమండలిలో వైసీపీ పేరే వినబడకూడదన్న ఉద్దేశ్యంతో చంద్రబాబు జిల్లా జిల్లాకొక వ్యూహాన్ని రచించారు. గెలుపుకోసం వందల కోట్ల రూపాయలను ఖర్చు చేసినట్లు ప్రచారంలో ఉంది. విజయాన్ని అందుకోవటం కోసం ఎంతటి అడ్డదారులైనా తొక్కవచ్చని టిడిపి నిరూపించింది.
మామూలుగా అయితే, పై మూడు జిల్లాల్లోనూ వైసీపీదే బలం. కడప జిల్లాలో 841 ఓట్లకు గాను వైసీపీకి 520 ఓట్లున్నాయి. నెల్లూరులోని 852 ఓట్లలో వైసీపీకి 500 ఓట్లున్నాయి. అదేవిధంగా కర్నూలు జిల్లాలోని 1084 ఓట్లకు వైసీపీకి 500 ఓట్లున్నాయి. అయినా టిడిపి గెలిచిందంటే ఏం చేస్తే గెలుపు సాధ్యమైందో అర్ధం చేసుకోవచ్చు. ప్రలోభాలు పెట్టి, డబ్బులు ఎరేసి, కేసులతో భయపెట్టి టిడిపి గెలిచిందని జగన్మోహన్ రెడ్డి ఎన్ననుకుంటే ఏంటట?
