టిక్కెట్టు విషయమై గట్టిగా డిమాండ్ చేస్తున్న నియోజకవర్గ ఇన్ ఛార్జ్, సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డితో చంద్రబాబు భేటీలో ఉండగానే అఖిల టిక్కెట్టుపై స్పష్టమైన ప్రకటన చేయటం విశేషమే.
నంద్యాల ఉప ఎన్నికల్లో టిడిపి తరపున పోటీ చేసే అభ్యర్ధి విషయమై మంత్రి అఖిలప్రియ ప్రకటన చేసేసారు. తమ కుటుంబ సభ్యులే పోటీ చేస్తారంటూ అఖిల చేసిన ప్రకటన ఒక విధంగా పార్టీలో సంచలనం రేపుతోంది. ఎందుకంటే, టిక్కెట్టు ఎవరికి కేటాయించాలో నిర్ణయించాల్సింది, ప్రకటించాల్సింది చంద్రబాబునాయుడే. అందులోనూ టిక్కెట్టు విషయమై గట్టిగా డిమాండ్ చేస్తున్న నియోజకవర్గ ఇన్ ఛార్జ్, సీనియర్ నేత శిల్పా మోహన్ రెడ్డితో చంద్రబాబు భేటీలో ఉండగానే అఖిల టిక్కెట్టుపై స్పష్టమైన ప్రకటన చేయటం విశేషమే.
తన తల్లి శోభానాగిరెడ్డి వర్ధంతి అయిన ఈనెల 24వ తేదీన అభ్యర్ధి ఎవరో కూడా ప్రకటిస్తామంటూ మంత్రి చేసిన ప్రకటనతో పార్టీలో వేడి రాజుకుంది. అఖిల కూడా కొద్దిగా వ్యూహాత్మకంగానే వ్యవహరించిందనే చెప్పాలి. ఎందుకంటే, నంద్యాలలో టిక్కెట్టు కోసం భూమా వీర శేఖర రెడ్డి కుమారుడు భూమా బ్రహ్మానందరెడ్డి కూడా చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. అందుకనే అఖిల కూడా తమ కుటుంబంలోనే పోటీ చేస్తారని చెప్పారు. సోదరి భూమా సౌమ్య కావచ్చు లేదా బ్రహ్మానందరెడ్డీ కావచ్చు. కాకపోతే అఖిల సోదరి సౌమ్య పోటీ చేయటానికే అవకాశం ఎక్కువుంది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ మంత్రి ఉప ఎన్నిక విషయంలో అందులోనూ వివాదస్పదమైన తర్వాత ఏకపక్ష ప్రకటన చేయటం బహుశా టిడిపిలో ఇదే తొలిసారేమో. అందునా చంద్రబాబు ఈ విషయమై ఇంత వరకూ ఎక్కడా నోరు మెదపలేదు. అటువంటిది అఖిల ఏకపక్షంగా ప్రకటన చేయటమంటే పెద్ద సాహసం క్రిందే లెఖ్ఖే. తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వకపోతే పార్టీ వీడేందుకు సైతం శిల్పా సిద్ధపడ్డారు. ఈ విషయాన్ని గతంలోనే చంద్రబాబు మెహంమీదే స్పష్టంగా చెప్పారు.
ఒకవేళ శిల్పా గనుక పార్టీ వీడితే టిడిపికి నంద్యాలలో గెలుపు అంత వీజీ కాదు. అందులోనూ శిల్పా గనుక వైసీపీలో చేరి టిక్కెట్టు తెచ్చుకుంటే టిడిపికి గట్టి పోటీ ఇవ్వటం ఖాయం. అందులోనూ నియోజకవర్గంలో గట్టి అనుచరులున్న శిల్పాను ఎన్నికల్లో ఢీ కొనటం అంత సులభం కాదు. ఆ విషయాలన్నీ చంద్రబాబుకు బాగా తెలుసు. అందుకనే శిల్పాతో సమావేశమై బుజ్జగిస్తున్నారు.
