టిడిపి-జనసేన అభ్యర్థుల ప్రకటనతో కూటమిలో అలజడి రేగింది. ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులు టిడిపి అదిష్టానంపై తిరుగుబాటు ప్రకటించగా మరికొందరు నాయకులు ముందస్తు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
విజయవాడ : ప్రధాన పార్టీలన్నీ ఎన్నిలకు సిద్దమవుతుండటంతో ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. మరోసారి గెలిచి అధికారాన్ని నిలబెట్టుకునేందుకు వైసిపి, తిరిగి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు టిడిపి-జనసేన కూటమి విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలో నాయకుల వడపోత చేపట్టి గెలుపుగుర్రాలను బరిలోకి దింపేందుకు పార్టీలన్నీ సిద్దమయ్యాయి. దీంతో టికెట్ ఆశించి భంగపడ్డ నాయకులతో ఆ పార్టీలకు పెద్ద తలనొప్పి వచ్చిపడింది. అదిష్టానం బుజ్జగించినా వెనక్కితగ్గకుండా కొందరు నాయకులు తిరుగుబాటు చేస్తున్నారు. ఇలా కొందరు టిడిపి నాయకులు తనకే టికెట్ కావాలంటుంటే మరికొందరేమో ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకు సిద్దమవుతున్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గత ఎన్నికల్లో తనను ఓడించిన ప్రత్యర్థి కోసం మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం టికెట్ త్యాగం చేయాల్సివస్తోంది. వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ టిడిపిలో చేరేందుకు సిద్దం కావడంతో ఆయనకే టికెట్ ఇవ్వాలని టిడిపి నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మైలవరం టికెట్ ఆశిస్తున్న ఉమతో ఇటీవల టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. అధినేత సముదాయించడంతో ఉమ కూడా వసంత కృష్ణప్రసాద్ కు సహకరించేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది.
మైలవరం టికెట్ పంచాయితీ ముగిసిందని అనుకుంటున్న సమయంలో మరో టిడిపి నేత బొమ్మసాని సుబ్బారావు తెరపైకి వచ్చారు. మైలవరం టికెట్ తనకే ఇవ్వాలి... ఎట్టి పరిస్థితుల్లో వసంతకు సహకరించేది లేదని సుబ్బారావు హెచ్చరిస్తున్నాడు. ఇంతకాలం టిడిపి నాయకులను ఇబ్బందిపెట్టిన వ్యక్తికి టికెట్ ఎలా ఇస్తారంటూ అదిష్టానాన్ని సుబ్బరావు ప్రశ్నిస్తున్నారు.
Also Read Andhra Pradesh Assembly Elections 2024 : టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్యే...: జనసేన నాయకుడి హెచ్చరిక
అయితే ఉమ మాదిరిగానే సుబ్బారావును కూడా తమ దారికి తెచ్చుకునేందుకు వసంత ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే సుబ్బారావును కలిసి వసంత నాగేశ్వరరావు
తన కుమారుడికి సహకరించాలని కోరారు. కృష్ణప్రసాద్ కూడా ఇప్పటికే మైలవరం టిడిపి నాయకులను కలుస్తున్నారు... త్వరలోనే సుబ్బారావును కూడా కలిసి సహకరించాలని కోరనున్నట్లు సమాచారం. ఆ తర్వాత బొమ్మసాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
మార్చి 2న వసంత కృష్ణప్రసాద్ టిడిపిలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు నాయుడు లేదంటే నారా లోకేష్ సమక్షంలో ఆయన పసుపు కండువా కప్పుకోనున్నారు. భారీగా అనుచరులు, వెంటవచ్చే వైసిపి నాయకులతో వసంత టిడిపిలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
ఇదిలావుంటే నూజివీడు టిడిపిలో కూడా టికెట్ పంచాయితీ సాగుతోంది. ఇటీవలే వైసిపి నుండి టిడిపిలో చేరిన మాజీ మంత్రి కొలుసు పార్ఠసారథిని మైలవరం అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో ఇంతకాలం నూజివీడు టిడిపి ఇంచార్జీగా వున్న ముద్రబోయినవ వెంకటేశ్వరరావు తిరుగుబాటు చేస్తున్నారు. ఇప్పటికే టిడిపికి రాజీనామమా చేసిన ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు. గతంలో కూడా తాను ఇండిపెండెంట్ గా పోటీచేసి గెలిచానని... మళ్లీ అలాగే గెలుస్తానన్న ధీమా ముద్రబోయిన వ్యక్తం చేసారు.
టిడిపి వాళ్లు ఓట్ల కోసం వస్తే నిలదీయాలని నూజివీడు ప్రజలకు ముద్రబోయిన సూచించారు. గత పది సంవత్సరాలు ఎందుకు వాడుకున్నారు? ఇప్పుడు ముద్రబోయిన చేసిన తప్పేంటి? అని ప్రశ్నించాలని సూచించారు. టికెట్ నిరాకరించడం ద్వారా కేవలం తననే కాదు తన సామాజికవర్గాన్ని రోడ్డుపై నిలబెట్టారని ముద్రబోయిన ఆవేదన వ్యక్తం చేసాడు.
