Andhra Pradesh Assembly Elections 2024 : టికెట్ ఇవ్వకుంటే ఆత్మహత్యే...: జనసేన నాయకుడి హెచ్చరిక
అభ్యర్థుల ప్రకటన టిడిపి-జనసేన కూటమిలో చిచ్చు పెట్టింది. టికెట్లు ఆశించి భంగపడ్డ నాయకులు తమ అధిష్టానంతో అమీతుమీకి సిద్దమయ్యారు. మరికొందరయితే తమకు అవకాశం ఇవ్వకుంటే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు.
అమరావతి : ఎన్నికల వేళ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార వైసిపితో పాటు ప్రతిపక్ష టిడిపి-జనసేన కూటమికి అభ్యర్థుల ఎంపిక పెద్ద తలనొప్పిగా మారింది. టికెట్ దక్కినవారు ఆనందంలో మునిగిపోగా... ఆశించి భంగపడ్డవారు పార్టీలపై తిరుగుబాటు చేస్తున్నారు. ఓ జనసేన నాయకుడు ఎమ్మెల్యే టికెట్ కోసం ఏకంగా ప్రాణాలు తీసుకుంటానని పార్టీ అదిష్టానాన్ని హెచ్చరిస్తున్నాడు.
వివరాల్లోకి వెళితే... పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గ జనసేన నాయకుడు విడివాడ రామచంద్రారావు ఈసారి ఎన్నికల్లో పోటీకి అంతా సిద్దం చేసుకున్నాడు. నియోజకవర్గ ఇంచార్జీగా వున్న తనకే టికెట్ దక్కుతుందని నమ్మాడు. కానీ పొత్తులో భాగంగా తణుకు సీటు టిడిపికి దక్కింది... ఇప్పటికే కూటమి అభ్యర్థిని కూడా ప్రకటించారు. టిడిపి-జనసేన కూటమి తరపున మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ బరిలోకి దింపారు. దీంతో తీవ్ర అసంతృప్తికి గురయిన రామచంద్రారావు అనుచరులతో ఆందోళనకు దిగారు.
ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటిస్తున్న జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ కు విడివాడ వర్గీయుల నిరసన సెగ తగిలింది. సోమవారం రాత్రి నాదెండ్ల బసచేసిన పెంటపాడు మండలం అలంపురంలోని జయా గార్డెన్ వద్ద తన అనుచరులతో కలిసి ఆందోళనకు దిగాడు రామచంద్రరావు. జనసేన పార్టీ తణుకులో చాలా బలంగా వుంది... కాబట్టి ఇక్కడ పోటీ చేయాలని విడివాడ కోరారు. తనకు టికెట్ ఇస్తే గెలిచి చూపిస్తానని... లేదంటే ప్రాణాలు తీసుకుంటానని విడివాడ హెచ్చరించాడు.
వీడియో
విడివాడ రామచంద్రరావు అనుచరులు, జనసేన కార్యకర్తలతో నాదెండ్ల బసచేసిన గెస్ట్ హౌస్ వద్ద ఆందోళన చేపట్టడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వెంటనే తాడేపల్లిగూడెం డిఎస్పి పోలీస్ బలగాలతో అక్కడికి చేరుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జాగ్రత్తపడ్డారు. అలాగే జనసేన నాయకులు బొలిశెట్టి శ్రీనివాస్, కందుల దుర్గేష్ అక్కడికి చేరుకుని విడివాడ వర్గీయులను సముదాయించే ప్రయత్నం చేసారు. అయినాకూడా విడివాడ రామచంద్రరావు వెనక్కి తగ్గకుండా ఆందోళన కొనసాగించారు. పెద్దపెట్టున నినాదాలు చేస్తూ నిరసన కొనసాగించడంతో ఉద్రిక్తత ఏర్పడింది.
Also Read ఏపీ అసెంబ్లీ ఎన్నికలు : టికెట్ వుందా లేదా.. చంద్రబాబు ఇంటికి సీనియర్ నేతల క్యూ
అంతకుముందు ప.గో జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావు అసంతృప్తితో వున్న విడివాడతో చర్చలు జరిపారు. ఆయన ఇంటికి వెళ్లి సముదాయించేందుకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తానే నాదెండ్లను కలిసే ఏర్పాటు చేస్తానని గోవిందరావు హామీ ఇచ్చినా విడివాడ వినిపించుకోకుండా జయా గార్డెన్ కు చేరుకున్నారు. తమ నాయకుడికే తణుకు టికెట్ ఇవ్వాలంటూ విడివాడ రామచంద్రరావు వర్గం నిరసన చేపట్టింది. కూటమి అభ్యర్థి రాధాకృష్ఱ పాదయాత్రను అడ్డుకుంటామని హెచ్చరించారు.