అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని. ఒక రాజకీయ పార్టీని ఎలా నడపాలో తెలియని వ్యక్తి వైఎస్ జగన్ అంటూ మండిపడ్డారు. 

ప్రజల సమస్యలపై ఎలా స్పందించాలో ఎప్పుడు స్పందించాలో అన్న విషయం కూడా తెలియదు పాపం జగన్ కు అంటూ చమత్కరించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, కేంద్రం యెుక్క నియంతృత్వ పోకడలకు చెక్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలను ఏకం చేస్తున్నారని తెలిపారు. 

బీజేపీ నియంతృత్వానికి చెక్ పెట్టాలనే టాస్క్ ను చంద్రబాబు పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఒక శిల్పి అంటూ కొనియాడారు సాధినేని యామిని. అభివృద్ధి అనే శిల్పాన్ని నిరంతరాయంగా చెక్కుతూనే ఉంటారని స్పష్టం చేశారు. 

ఏపీలో చంద్రబాబు చెక్కిన అభివృద్ధికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ లాంటి ఎన్నో అభివృద్ధి పనులు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అయితే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు ఎప్పుడు ఏం చేయాలో తెలియదని ఎద్దేవా చేశారు. 

రాష్ట్రం విడిపోయిన తర్వాత అమరావతికి రావాల్సిన జగన్ ఐదేళ్లు కాలయాపన చేశారంటూ విరుచుకుపడ్డారు. 2014లో ప్రతిపక్ష హోదా వచ్చినప్పుడు మూటా ముల్లె సర్దుకుని వచ్చి అమరావతిలో ఉండాల్సింది పోయి ఇప్పుడు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని తెలిసి అమరావతికి వస్తున్నారని విమర్శించారు. 

ఇదీ వైఎస్ జగన్ కు చంద్రబాబుకు ఉన్న తేడా అంటూ చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు కేంద్రం కుయుక్తులు పన్నితే అందుకు ఇంటి దొంగలా వైసీపీ తలుపులు తెరిచిందని విమర్శించారు. శత్రువులకు తలుపులు తెరిచిన ఇంటిదొంగ అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి శత్రువుల చేతుల్లో నలిగిపోవడం తప్ప ఆయనకు ఒరిగేదేమీ ఉండదన్నారు సాధినేని యామిని.