టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు మిత్రుడి అరెస్టు: కారణం ఇదీ....
టీడీపీ సానుభూతి పరుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు మిత్రుడు నలంద కిశోర్ ను సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. అవంతి శ్రీనివాస్ రావు, విజయసాయి రెడ్డిలపై వచ్చిన వార్తాకథనాన్ని ఫార్వర్డ్ చేశారనే ఆరోపణపై ఆయనను అరెస్టు చేశారు.
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సానుభూతిపరులను పోలీసులు వివిధ కేసుల్లో అరెస్టు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామును టీడీపీ సానుభూతిపరుడు నలంద కిశోర్ ను సీఐడీ పోలీసులు విశాఖపట్నంలో అరెస్టు చేశారు. నలంద కిశోర్ మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాస రావు మిత్రుడు.
ఆంధ్రప్రదేశ్ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు, వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిలపై మీడియాలో సందడి చేస్తున్న వార్తాకథనాన్ని ఫార్వర్డ్ చేశారనే ఆరోపణపై ఆయనను సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నలంద కిశోర్ కు మూడు రోజుల క్రితం సిఐడి అధికారులు నోటీసులు జారీ చేశారు. నలంద కిశోర్ ఇచ్చిన సమాధానంతో అధికారులు సంతృప్తి చెందలేదు. దీంతో ఆయనను అరెస్టు చేశారు. తమ కార్యాలయంలో ఆయనను సిఐడి అధికారులు విచారిస్తున్నారు.
ఇదిలావుంటే, కృష్ణా జిల్లా నందిగామలో టీడీపీకి చెందిన చిరుమామిళ్ల కృష్ణను కూడా అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టారంటూ అర్థరాత్రి ఆయనను సిఐడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను కర్నూలు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.