టీడీపీ సీనియర్ నేత నారాయణ.. లోకేష్ పాదయాత్రలో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాశంమైంది. యాత్రలో రద్దీ ఎక్కువ కావడం వల్లే తాను వెనుతిరిగి వచ్చానని నారాయణ వివరణ ఇచ్చారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్ర ప్రస్తుతం నెల్లూరు జిల్లా మీదుగా సాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇదే జిల్లాకు చెందని మాజీ మంత్రి , టీడీపీ సీనియర్ నేత నారాయణ.. లోకేష్ పాదయాత్రలో ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాశంమైంది. దీనిపై మీడియాలోనూ రకరకాలుగా కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నారాయణ వివరణ ఇచ్చారు. యాత్రలో రద్దీ ఎక్కువ కావడం వల్లే తాను వెనుతిరిగి వచ్చానని చెప్పారు. ఆడపడుచులతో లోకేష్ నిర్వహించిన మహాశక్తి కార్యక్రమానికి తాము 800 మందిని మాత్రమే అంచనా వేస్తే.. మా లెక్కలను తారుమారు చేస్తూ, 3 వేల మంది వచ్చారని నారాయణ వెల్లడించారు.
రాజకీయ నాయకుడి లక్ష్యం అభివృద్దేనని.. అంతేకానీ తిట్టడం, తిట్టించుకోవడం కాదన్నారు. తెలుగుదేశం హయాంలో నెల్లూరు నగరాన్ని ఎంత అభివృద్ధి చేశామో ప్రజలందరికీ తెలుసునని నారాయణ పేర్కొన్నారు. ప్రస్తుతం నెల్లూరు రూరల్‌లో కొనసాగుతున్న లోకేశ్ యువగళం పాదయాత్ర.. మంగళవారం సాయంత్రం నెల్లూరు అర్భన్ నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది. నగరంలోని వీఆర్సీ సెంటర్‌లో లోకేష్ భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు .
ఇకపోతే.. నారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. గత కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులను ఓడించేందుకు డబ్బులు పంపారని ఆరోపించారు. అయితే తనకు పంపిన డబ్బులు తిరిగిచ్చేశానని.. ఇప్పటి వరకు సమయం రాకపోవడంతో ఈ విషయం బయటపెట్టలేదని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడే వున్నానని.. అవసరమైతే ప్రమాణం చేస్తానని ఆయన స్పష్టం చేశారు.
టీడీపీ జెండాలను మోసిన వారిని మోసం చేయడం ఆ పార్టీకి అలవాటేనని.. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అబ్ధుల్ అజీజ్‌లే ఇందుకు నిదర్శనమని అనిల్ కుమార్ దుయ్యబట్టారు. లోకేష్ పాదయాత్ర చూసి టీడీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారని మాజీ మంత్రి సెటైర్లు వేశారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే.. లోకేష్ ప్రజాక్షేత్రంలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. పేపర్ చూసి సరిగా చదవలేని లోకేష్ తనపై మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు.
ఇదిలావుండగా. . 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ టీడీపీ అభ్యర్ధిగా నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో జనసేన అభ్యర్ధి కారణంగా అనిల్ కుమార్ తృటిలో ఓటమిని తప్పించుకున్నారని నెల్లూరు జనాలు చెప్పుకుంటూ వుంటారు. అయితే ఈసారి అదే స్థానంలో పోటీ చేసి బదులు తీర్చుకోవాలని నారాయణ ఫిక్స్ అయ్యారట. నెల్లూరు అర్బన్‌లో అనిల్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి.
