గత కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులను ఓడించేందుకు నారాయణ డబ్బులు పంపారని ఆరోపించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.  అవసరమైతే ప్రమాణం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 

టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌. గత కార్పోరేషన్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధులను ఓడించేందుకు డబ్బులు పంపారని ఆరోపించారు. అయితే తనకు పంపిన డబ్బులు తిరిగిచ్చేశానని.. ఇప్పటి వరకు సమయం రాకపోవడంతో ఈ విషయం బయటపెట్టలేదని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు. తాను చేసిన ఆరోపణలకు కట్టుబడే వున్నానని.. అవసరమైతే ప్రమాణం చేస్తానని ఆయన స్పష్టం చేశారు. 

టీడీపీ జెండాలను మోసిన వారిని మోసం చేయడం ఆ పార్టీకి అలవాటేనని.. కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, అబ్ధుల్ అజీజ్‌లే ఇందుకు నిదర్శనమని అనిల్ కుమార్ దుయ్యబట్టారు. లోకేష్ పాదయాత్ర చూసి టీడీపీ నాయకులు తలలు పట్టుకుంటున్నారని మాజీ మంత్రి సెటైర్లు వేశారు. తాను రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే.. లోకేష్ ప్రజాక్షేత్రంలో ఓడిపోయారని ఎద్దేవా చేశారు. పేపర్ చూసి సరిగా చదవలేని లోకేష్ తనపై మాట్లాడటం విడ్డూరంగా వుందన్నారు. 

Also Read: నన్ను ఓడిస్తే రాజకీయాలకు గుడ్‌బై: లోకేష్ కు అనిల్ సవాల్

ఇదిలావుండగా. . 2019 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో నారాయణ టీడీపీ అభ్యర్ధిగా నెల్లూరు సిటీ నుంచి పోటీ చేశారు. ఆ సమయంలో జనసేన అభ్యర్ధి కారణంగా అనిల్ కుమార్ తృటిలో ఓటమిని తప్పించుకున్నారని నెల్లూరు జనాలు చెప్పుకుంటూ వుంటారు. అయితే ఈసారి అదే స్థానంలో పోటీ చేసి బదులు తీర్చుకోవాలని నారాయణ ఫిక్స్ అయ్యారట. నెల్లూరు అర్బన్‌లో అనిల్ కుమార్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న పరిణామాలు హాట్ టాపిక్‌గా మారాయి. 

జిల్లాకు చెందిన ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్ అయ్యారు. వీరు టీడీపీలో చేరనున్నారు. అనిల్‌కు ఆయన బాబాయ్ రూప్ కుమార్ యాదవ్‌తో పాటు కొందరు కీలక నేతలు దూరంగా వుంటున్నారు. ఇటీవల సీఎం జగన్‌ను కలిసిన అనిల్.. నియోజకవర్గంలోని పరిస్థితిపై వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లోనూ అక్కడ వైసీపీ జెండా ఎగరాలని, కలిసి పనిచేయాలని సూచించారు. తాడేపల్లి నుంచి వచ్చిన నాటి నుంచి అనిల్ దూకుడు ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే నారాయణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో చూడాలి.