పరిషత్ ఎన్నికల బహిష్కరణపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయంపై పార్టీలో మిశ్రమ స్పందన వినిపిస్తోంది. ఇప్పటికే జ్యోతుల నెహ్రూ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

తాజాగా మరో సీనియర్ నేత అశోక్ గజపతి రాజు సైతం బాబు నిర్ణయాన్ని తప్పుబట్టారు. బరిలో వున్న అభ్యర్ధులు పోటీ చేయడంపై స్థానిక కేడర్ అభిప్రాయాన్ని తీసుకోవాల్సి వుందన్నారు.

నిజమైన కార్యకర్తలకు ఇబ్బందులు తప్పవని అశోక్ గజపతి రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకగ్రీవాలపై వ్యతిరేకత వచ్చిందని.. అయినా ఆగినచోటు నుంచే ప్రారంభిస్తున్నారని ఎస్ఈసీపైనే విమర్శలు గుప్పించారు. గెలిచినా గెలవకపోయినా బరిలో నిలవడం మన బాధ్యత నిర్వర్తించాలని హితవు పలికారు. 

కాగా, జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత అసంతృప్తి వ్యక్తం చేశారు.

Also Read:చంద్రబాబుకు జ్యోతుల నెహ్రూ షాక్: పార్టీ పదవికి రాజీనామా

ఎన్నికలపై సీఎం, మంత్రులు ముందు ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికలు నిర్వహిస్తున్నారని బాబు ఎద్దేవా చేశారు.

పరిషత్ ఎన్నికలపై గవర్నర్‌కు మాజీ ఎస్ఈసీ లేఖ రాశారని ఆయన గుర్తుచేశారు. బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించారని.. రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకోకుండా నోటిఫికేషన్ ప్రకటించారని చంద్రబాబు మండిపడ్డారు.