Asianet News TeluguAsianet News Telugu

చంద్రబాబుకు జ్యోతుల నెహ్రూ షాక్: పార్టీ పదవికి రాజీనామా

తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు. ఇకపై ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న పార్టీ నిర్ణయాన్ని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. 

jyothula nehru resigned as tdp vice president post ksp
Author
Amaravathi, First Published Apr 2, 2021, 7:00 PM IST

తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్ష పదవికి జ్యోతుల నెహ్రూ రాజీనామా చేశారు. ఇకపై ఇన్‌ఛార్జ్‌గా కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు. పరిషత్ ఎన్నికలను బహిష్కరించాలన్న పార్టీ నిర్ణయాన్ని నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

2014 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ టికెట్ పై తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నుంచి నెహ్రూ గెలుపొందారు. కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కావడంతో జగన్ ఆయనకు ఉప ప్రతిపక్షనేత పదవి ఇచ్చారు.

త‌ద‌నంత‌రం చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల్లో జ్యోతుల నెహ్రూ పార్టీని వీడారు. తెలుగుదేశంలో చేరారు. జ్యోతుల నెహ్రూకు మంత్రి ప‌ద‌వి ఇస్తామ‌ని అప్ప‌ట్లో చంద్ర‌బాబు ఆశ పెట్టార‌ని, అందుకే ఆయ‌న ఆ నిర్ణ‌యాన్ని తీసుకున్నార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి.

మొన్న‌టి ఎన్నిక‌ల్లో జ‌గ్గంపేట అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచే తెలుగుదేశం పార్టీ త‌ర‌ఫున పోటీ చేశారు. త‌న స‌మీప బంధువు జ్యోతుల చంటిబాబు చేతిలో ఓట‌మి పాల‌య్యారు. దీంతో నాటి నుంచి నెహ్రూ పార్టీ కార్యక్రమాలకు దూరంగానే వుంటున్నారు. 

కాగా, జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను బహిష్కరిస్తూ టీడీపీ సంచలన నిర్ణయం తీసుకుంది. పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్‌పై తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్షనేత అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఎన్నికలపై సీఎం, మంత్రులు ముందు ప్రకటనలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించి ఎన్నికలు నిర్వహిస్తున్నారని బాబు ఎద్దేవా చేశారు. పరిషత్ ఎన్నికలపై గవర్నర్‌కు మాజీ ఎస్ఈసీ లేఖ రాశారని ఆయన గుర్తుచేశారు.

బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించారని.. రాజకీయ పార్టీల అభిప్రాయాన్ని తీసుకోకుండా నోటిఫికేషన్ ప్రకటించారని చంద్రబాబు మండిపడ్డారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో 79 శాతం ఎంపీటీసీలు ఏకగ్రీవం అయ్యాయని టీడీపీ చీఫ్ పేర్కొన్నారు.

బలవంతంగా నామినేషన్లు విత్ డ్రా చేయించి ఏకగ్రీవం చేసుకున్నారని ప్రతిపక్షనేపత ఆరోపించారు. పెన్షన్లు, రేషన్లు, అమ్మఒడి, రైతు భరోసా రావని ఓటర్లను బెదిరించారని చంద్రబాబు ధ్వజమెత్తారు.

2014లో రెండు శాతం ఏకగ్రీవమవ్వగా.. 2020లో 24 శాతం ఏకగ్రీవమయ్యాయని ఆయన తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఫ్రీ అండ్ పెయిర్ ఎన్నికలు జరగాలని చంద్రబాబు చెప్పారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక ఫార్స్‌గా మారిపోయాయని ఆయన ఎద్దేవా చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios