అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరిగారు టీడీపీ సీనియర్ నేత ఆలపాటి రాజా. 
అసెంబ్లీలో రైతు సమస్యలపై జరిగిన చర్చలో సీఎం జగన్, మంత్రులు ప్రవర్తించిన తీరు సభ్య సమాజం సిగ్గు పడేలా ఉందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

సభలో సీఎం జగన్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడిన తీరు సరిగ్గా లేదన్నారు. సంఖ్యాబలం చూపించి బెదిరించేలా జగన్ వ్యాహరిస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

ఇకపోతే దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నను ఆదుకునే విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు బాధాకరమన్నారు. అన్నం పెట్టే రైతును ఆదుకునే విషయంలో ప్రభుత్వ ధోరణి బాధాకరమని విమర్శించారు. 

వడ్డీ లేని రుణాల విషయంలో టీడీపీ ప్రభుత్వంపై నిందలు వేశారని తీరా వాస్తవాలు చెప్పేసరికి సభను పక్కదోవ పట్టించారని విమర్శించారు.  

సభలో వాస్తవాలు ఒప్పుకోకుండా చర్చను పక్కదారి పట్టించడం ప్రభుత్వానికే చెల్లిందని విమర్శించారు. బడ్జెట్ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదన్నారు. 
అభివృద్ధి విషయంపై ఆర్థిక మంత్రికి కనీస అవగాహన లేకుండా పోయిందన్నారు.  

అసెంబ్లీలో పిట్టకథలు వినేందుకు బాగుంటాయి తప్పితే వాటివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. టీడీపీ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదని చెప్పిన సీఎం జగన్  ఈ బడ్జెట్లో సున్నా వడ్డీ కోసం కేవలం వంద కోట్లరూపాయలు మాత్రమే కేటాయించడం దురదృష్టకరమన్నారు. జగన్ మాట్లాడే మాటలకు చేసే పనులకు ఎక్కడా పొంతన లేదని విమర్శించారు ఆలపాటి రాజా.