శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలకు నిరసనగా తెలుగుదేశం కార్యకర్తలు నిరసన చేపట్టారు.

నర్సన్నపేట పీఎస్‌లో ఫిర్యాదు చేయడానికి భారీగా తరలివచ్చారు. మంత్రి ధర్మానపై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో బయటే రిప్రజెంటేషన్ ఇవ్వాలని పోలీసులు కోరారు.

దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే బెందాళం అశోక్, కూన రవికుమార్‌ నిరసనకు దిగారు. వైసీపీ నేతలు, మంత్రులు అధికారమదంతో నోటీకొచ్చినట్టాల్లా మాట్లాడుతున్నారని మండిపడ్డారు టీడీపీ నేత బుద్దా వెంకన్న.

పురోహితుడి నోటి నుంచి బూతులు రావడం దారుణమన్నారు. చంద్రబాబుపై మంత్రి ధర్మాన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రబాబును ఉద్దేశిస్తూ కృష్ణదాస్ అన్న 420 వ్యాఖ్యలన్ని ఆయనకే వర్తిస్తాయని బుద్ధా ఎద్దేవా చేశారు.

కాగా, శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జరిగిన సభలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై విరుచుకుపడ్డారు మంత్రి కృష్ణదాస్. రైతులను రెచ్చగొట్టి, ఉద్యమం నడపడానికి పెయిడ్‌ వర్కర్స్‌ను పెడుతున్నారు. మంచి టీ షర్టు, దాని మీద టర్కీ టవల్‌ వేసుకుని రైతులకు అన్యాయం చేస్తున్నాడంటూ అసభ్య పదజాలంతో దూషించారు.