రాజీనామాల ఆమోదంతో జగన్ కు క్రెడిట్: టీడీపిలో ఉలికిపాటు

TDP reacts on the acceptance of YCP MPs resignations
Highlights

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల రాజీనామాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉలికి పడినట్లే కనిపిస్తున్నారు.

అమరావతి: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుల రాజీనామాలతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉలికి పడినట్లే కనిపిస్తున్నారు. రాజీనామాల ఆమోదంతో ఉప ఎన్నికలు రావనే భావన వ్యక్తమవుతున్నప్పటికీ ప్రత్యేక హోదాపై పోరాటంలో వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ క్రెడిట్ కొట్టేసే అవకాశం ఉందనే భావన వ్యక్తమవుతున్నట్లు కనిపిస్తోంది. అందువల్లనే రాజీనామాల ఆమోదంపై తెలుగుదేశం నాయకులు పరిపరి విధాగాలు ప్రతిస్పందించారు.

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌ అగ్రిగోల్డ్ వ్యవహారంపై నోటికొచ్చినట్టు మాట్లాడటం సరికాదని ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవేనేని ఉమామహేశ్వర రావు అన్నారు. వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ప్రధాని మోదీని ప్రశ్నించలేకే రాజీనామా డ్రామాలాడుతున్నారని ఆయన విమర్శించారు. 

ఉపఎన్నికలు రావని తెలిసే బీజేపీతో కలిపి వైసిపి రాజకీయాలు చేస్తోందని ఆయన అన్నారు. ప్రత్యేక హోదాపై టీడీపీ పోరాటం కొనసాగుతుందని మంత్రి దేవినేని స్పష్టం చేశారు. బీజేపీ నేతలపైనా మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బీజేపీ ఎంపీ జీవీఎల్ వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని విమర్శించారు. 

ఏపీ ప్రయోజనాల గురించి జీవీఎల్ ఏనాడైనా మాట్లాడారా అని అడిగారు. కుటుంబరావును విమర్శిస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని మంత్రి హెచ్చరించారు.

కర్నాటక ఎంపీలు రాజీనామా చేస్తే వెంటనే ఆమోదించారని, అదే ఏప్రిల్‌ 6న వైసీపీ ఎంపీలు రాజీనామా చేస్తే ఇప్పటివరకు స్పీకర్‌ ఎందుకు ఆమోదించలేదని తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ప్రశ్నించారు. దీన్ని బట్టే బీజేపీ, వైసీపీ ఓ అవగాహనకు వచ్చాయని అర్థమవుతోందన్నారు. 

జగన్‌పై మండిపడ్డారు. జగన్ తన పాదయాత్రలో ఏనాడైనా మోడీవిమర్శించారా అని ఆయన బుధవారం మీడియా సమావేశంలో అడిగారు. ప్రజల్లోకి వెళ్లి పోరాటం చేస్తామన్న వైసీపీ ఎంపీలు పార్లమెంట్‌లో ఒక్కసారైనా ప్రధానిని నిలదీశారా అని ప్రశ్నించారు. 

వైసీపీ ఎంపీల రాజీనామాలవల్ల ఏపీకి ఏ విధమైన ప్రయోజనం ఉండదని తెలుగుదేశం మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. జూన్ 4వ తేదీకి ముందే రాజీనామాలను ఆమోదింపచేసుకుని ఉంటే చిత్తశుద్ధి తెలిసేదని అన్నారు. రాజీనామాలవల్ల ప్రత్యేక హోదా రావాలని, ఉప ఎన్నికలు రావాలని, ఎన్నికలు జరిగితే వారికి ప్రజల్లో ఉన్న సత్తా ఏంటో తెలుస్తుందని ఆయన ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ ప్రతినిధితో అన్నారు. 

ఇప్పుడు వారు రాజీనామాలు ఆమోదింప చేసుకున్నా ఉప ఎన్నికలు రావని, వైసీపీ రాజీనామాలంతా ఓ డ్రామా అని తాము ముందు నుంచే చెబుతున్నామని అన్నారు. వారు రాజీనామాలు చేసి రెండు నెలలు అయిందని, ఇంతవరకు వారు ఎందుకు రాజీనామాలను ఆమోదింపచేసుకోలేదని నారాయణ అన్నారు. 
2015 నుంచి రాజీనామాల డ్రామా ఆడుతున్నారని, వాళ్లకు చిత్తశుద్ది ఉంటే ఆనాడు రాజీనామాలు చేసుంటే వాళ్ల నిజాయితీని గౌరవించేవాళ్లమని నారాయణ అన్నారు.

వైఎస్పార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజీనామాలపై డ్రామాలు బాగా ఆడుతున్నారని తెలుగుదేశం ఎంపీ శివప్రసాద్ అన్నారు. అందరూ బాగా నటించి ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు. 

1951 యాక్ట్ ప్రకారం ఇప్పుడు రాజీనామాలు ఆమోదించుకుంటే ఎన్నికలు జరగవని తెలిసే డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని శివప్రసాద్ అన్నారు.

loader