అధికార తెలుగుదేశంపార్టీ ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీని ఉద్దేశ్యపూర్వకంగానే రెచ్చ గొడుతున్నట్లు కనబడుతోంది. ఫిరాయింపులకు వ్యతిరేకంగానే తాము అసెంబ్లీ సమావేశాలను సైతం బహిష్కరిస్తున్నట్లు వైసీపీ చెబుతోంది. అటువంటి  సమయంలోనే వైసీపీకి చెందిన మరో ఎంఎల్ఏని ప్రలోభాలకు గురిచేసి చంద్రబాబునాయుడు టిడిపిలోకి లాక్కున్నారు. అసెంబ్లీ బహిష్కరణపై ఒకవైపు రచ్చ జరుగుతుండగానే మరోవైపు టిడిపి ఫిరాయింపులను యధేచ్చగా ప్రోత్సహిస్తోందంటే అర్ధమేంటి? వైసీపీని కావాలని రెచ్చ గొట్టడమే అని స్పష్టంగా తెలిసిపోతోంది.

సరే, ఫిరాయింపులందరూ ‘పచ్చ కండువా’ కప్పుకునే సమయంలో చెప్పేదొకటే మాట. ‘జగన్ వైఖరి నచ్చక..చంద్రబాబు చేస్తున్న అభివృద్ధిని చూసే’ టిడిపిలో చేరుతున్నట్లు చిలకపలుకులు వినిపిస్తుంటారు. లేకపోతే చంద్రబాబు ప్రలోభాలకు లొంగిపోయి వైసీపీని వీడుతున్నట్లు ఎవరూ చెప్పరు కదా?

ఈ పాయింట్ మీదే టిడిపి నిసిగ్గుగా ఫిరాయింపుల నాటకాన్ని నిరాఘాటంగా కొనసాగిస్తోంది. పాదయాత్ర మరో రెండు రోజుల్లో ప్రారభమవుతుందనగా, శ్రీవారిని దర్శించుకునేందుకు వైసీపీ అధినేత జగన్ తిరుమలకు చేరుకున్న సమయంలోనే తూర్పు గోదావరి జిల్లాలోని రంప చోడవరం ఎంఎల్ఏ వంతల రాజేశ్వరికి చంద్రబాబు టిడిపి కండువా కప్పారు.

అంటే, జగన్ ను రెచ్చ గొట్టటమే టిడిపి ఏకైక లక్ష్యంగా పెట్టుకున్న విషయం స్పష్టమైపోతోంది. కాకపోతే టిడిపి నేతలు మరచిపోయిన విషయం ఒకటుంది. జ్యోతుల నెహ్రూ టిడిపిలో చేరినపుడే రాజేశ్వరి కూడా చేరుతుందని ప్రచారం జరిగింది. ఎందుకో చేరలేదు. అయితే, గత రెండు నెలలుగా అదే ప్రచారం బాగా వినిపిస్తోంది.

అంటే అర్ధమేంటి? రాజేశ్వరి ఎప్పుడో ఒకపుడు గోడ దూకటం ఖాయమన్న విషయం వైసీపీలో అందరికీ తెలుసు. కాబట్టే రాజేశ్వరి టిడపి కండువా కప్పుకోవటాన్ని లైట్ తీసుకున్నారు. ప్రజాస్వామ్యంలో విలువలు పాటించాలంటూ నిత్యమూ ఎదుటి వారికి నీతులు చెప్పే ‘40 ఇయర్స్ ఇండస్ట్రీ’  ఆచరణలో తనకు మాత్రం ఆ నీతులు వర్తించవని మరోసారి నిరూపించుకున్నారు. పాదయాత్ర ముగిసేలోగా ఇంకెన్ని ఫిరాయింపులుంటాయో చూడాలి.