టీడీపీ ఎంపీలు సుజనా, సీఎం రమేష్‌, గరికపాటి, రవీంద్రకుమార్, సీతారామలక్ష్మి రాజ్యసభలోనే కూర్చోని విభజన హామీలు నెరవేర్చాలని నినాదాలతో హోరెత్తించారు.

రాజ్యసభ వాయిదా పడ్డా టిడిపి ఎంపిలు సభలోనే నిరసన కంటిన్యూ చేస్తున్నారు. టీడీపీ ఎంపీలు సుజనా, సీఎం రమేష్‌, గరికపాటి, రవీంద్రకుమార్, సీతారామలక్ష్మి రాజ్యసభలోనే కూర్చోని విభజన హామీలు నెరవేర్చాలని నినాదాలతో హోరెత్తించారు. నినాదాలు చేస్తున్న ఎంపీలను బయటికి తీసుకెళ్లేందుకు మార్షల్స్‌ యత్నించినా సాధ్యం కాలేదు.

ఆ క్రమంలో మార్షల్స్‌తో టీడీపీ ఎంపీల వాగ్వాదానికి దిగారు. ఇదిలా ఉంటే కాసేపట్లో పార్లమెంట్‌ సెంట్రల్‌ హాల్‌లో టీడీపీ లోక్‌సభ సభ్యులు ధర్నా చేపట్టనున్నారు. శుక్రవారం రోజు రాష్ట్రపతిని కలిసే యోచనలో టీడీపీ ఎంపీలు ఉన్నారు.

అయితే సభలో ఆందోళన విరమించాలని టీడీపీ ఎంపీలను కోరిన డిప్యూటీ చైర్మన్ కురియన్‌, కేంద్ర మంత్రి విజయగోయల్‌ పలుమార్లు కోరినా వాళ్లు మాత్రం ఆందోళన కొనసాగిస్తామని తేల్చిచెప్పారు. సభలో బైఠాయించిన టీడీపీ ఎంపీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు.

టీడీపీ ఎంపీల ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు మీడియాకు వివరించారు. కాగా ఈ పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన నాటినుంచి పార్లమెంట్ లోపల, బయట ప్రత్యేకహోదా ఇవ్వాలని ఏపీ ఎంపీలు పెద్దఎత్తున నిరసనలు చేపడుతున్న సంగతి తెలిసిందే.