ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, ఏపీ విభజన హమీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు మంగళవారం నాడు ధర్నా నిర్వహించారు.
న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు, ఏపీ విభజన హమీ చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీడీపీ ఎంపీలు మంగళవారం నాడు ధర్నా నిర్వహించారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ సాయిబాబా వేషధారణలో ధర్నా నిర్వహించారు.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రతి రోజూ ఏదో ఒక విచిత్ర వేషధారణతో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నాడు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభానికి ముందు టీడీపీ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. సత్యసాయి బాబా వేషధారణలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ తన నిరసనను కొనసాగించారు.
ఏపీకి ఇచ్చిన హమీలను అమలు చేయకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మోసం చేశారని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విమర్శించారు. సత్యం, ధర్మం, న్యాయం వంటి మానవతా విలువలను మోడీ పాటించడం లేదని ఆయన ఆరోపించారు.
తెలుగు ప్రజలు ఆత్మగౌరవం కలవారన్నారు. తెలుగు ప్రజలకు ఇచ్చిన హమీలను అమలు చేయకుండా ఇంకా తప్పులు చేసుకొంటూ పోతున్నారన్నారు. ఏపీ ప్రజల దెబ్బ రుచి చూడాలనుకొంటే ఇంకా తప్పులు చేయాలని మోడీకి శివప్రసాద్ సూచించారు.
ఏపీ ప్రజల మనోభావాలను గుర్తించి ప్రత్యేక హోదా, విభజన హమీ చట్టంలో పొందుపర్చిన అన్ని అంశాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.విశాఖలో రైల్వేజోన్ అంశంపై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేయడాన్నిటీడీపీ ఎంపీలు తప్పుబడుతున్నారు.
