తెలుగుదేశంపార్టీ ప్రభుత్వంలో విచిత్రాలు జరుగుతున్నాయి. ఐఏఎస్ అధికారులకు, వైసిపి ఎంపి విజయసాయిరెడ్డికి మధ్య వివాదం మొదలైతే మద్యలో టిడిపి ఎంపి ఎటరయ్యారు. టిడిపి ఎంపికి, వివాదానికి ఏమి సంబంధమో అర్ధం కావటంలేదు. చూడబోతే విజయసాయిరెడ్డిపై ఎలాగైనా కేసు నమోదు చేసేందుకు టిడిపి పక్కాగా ప్లాన్ చేసిందా అన్న అనుమానాలు మొదలయ్యాయి.

ఇంతకీ విషయం ఏమిటంటే, నలుగురు ఏఐఎస్ అధికారులపై విజయసాయిరెడ్డి ఆరోపణలు చేశారు. ఫిరాయింపు ఎంఎల్ఏల కొనుగోళ్ళు వెనుక ఏఐఎస్ అధికారుల హస్తముందన్నది విజయసాయి ఆరోపణలు. అందుకు మంత్రులు, ఆ నలుగురు ఏఐఎస్ అధికారులు ఘాటుగా స్పందించారు. గురువారం వారి ఘాటు స్పందనకు జవాబుగా ఎంపి మళ్ళీ రెచ్చిపోయారు. తన ఆరోపణలకు తగిన  ఆధారాలున్నాయన్నారు. అవసరమైతే ఆధారాలను చూపిస్తానని కూడా సవాలు విసిరారు.

 

 

ఎంపి సవాలుకు ఇంకా ఏఐఎస్ అధికారులు సమాధానిమివ్వనేలేదు. ఇంతలో నరసరావుపేట టిడిపి ఎంపి రాయపాటి సాంబశివరావు సీన్ లోకి ఎంటరయ్యారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలపై కేసు నమోదు చేయాలని డీజీపీకి లేఖ రాశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీపై కేసు నమోదు చేయాలని లేఖలో ఆయన పేర్కొన్నారు.

రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్న ఐఏఎస్‌, ఐపీఎస్‌లను కించపరిచేలా ఎంపి మాట్లాడారన్నారు. గతంలో కూడా ఐఏఎస్‌, ఐపీఎస్‌లను జగన్‌ బెదిరించారని రాయపాటి లేఖలో వివరించారు. చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోనందున జగన్‌, విజయసాయిరెడ్డి ఇద్దరిపై కేసు నమోదు చేయాలన్నారు. ఏ సెక్షన్ల క్రింద ఇద్దరిపైన కేసులు నమోదు చేయాలో కూడా రాయపాటే డిజిపికి సూచించటం గమనార్హం. అసలు వివాదం ఎంపికి ఏఐఎస్ అధికారులకైతే మధ్యలో జగన్ పైన కేసు నమోదు చేయాలని డిమాండ్ చేయటమేంటో అర్ధం కావటం లేదు. అయితే ఈ వ్యవహారంలో డీజీపీ ఎలా ముందుకెళ్తారో వేచి చూడాల్సిందే.