హరిబాబుకు కౌంటర్: అన్నీ అబద్దాలే: రామ్మోహన్ నాయుడు

TDP MP Rammohannaidu reacts on Bjp Mp Haribabu comments
Highlights

బీజేపీ ఎంపీ హరిబాబుకు పార్లమెంట్‌ వేదికగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కౌంటరిచ్చారు. ఏపీకి ఇచ్చిన  హమీలను కేంద్రం విస్మరించిందని  అంకెలతో వివరించారు

న్యూఢిల్లీ:  బీజేపీ ఎంపీ హరిబాబుకు పార్లమెంట్‌ వేదికగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు కౌంటరిచ్చారు. ఏపీకి ఇచ్చిన  హమీలను కేంద్రం విస్మరించిందని  అంకెలతో వివరించారు.  సమయం పూర్తైందని పదే పదే స్పీకర్ ప్రకటించారు. అయినా రామ్మోహన్ నాయుడు  తన ప్రసంగాన్ని కొనసాగించారు.  చివరకు రామ్మోహన్ నాయుడు మైక్ కట్ చేసి ఆప్ ఎంపీకి స్పీకర్ అవకాశం కల్పించారు. తనకు దక్కిన అవకాశాన్ని బీజేపీ తీరును ఎండగట్టేందుకు  రామ్మోహన్ నాయుడు ఉపయోగించుకొన్నారు.

అవిశ్వాసంపై  జరిగన చర్చ సందర్భంగా టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు బీజేపీ తీరుపై విమర్శలు గుప్పించారు. విశాఖ నుండి హరిబాబు ఎంపీగా విజయం సాధించినా.... ఢిల్లీ మాటలు మాట్లాడుతున్నారని ఘాటుగా విమర్శించారు.

ఏపీకి ఇచ్చింది 5 శాతం నిధులేనని రామ్మోహన్ నాయుడు చెప్పారు. ఇంకా ఇవ్వాల్సిన నిధుల గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రస్తావించారు.  తాను ప్రధానిగా ఎన్నికైతే  ఏపీకి పదేళ్లపాటు ప్రత్యేక హోదాను కల్పిస్తానని ఏపీలో ఎన్నికల ప్రచార సభల్లో మోడీ చేసిన వాగ్దానాలను రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు. 

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అరుణ్ జైట్లీ కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.  పదేళ్లపాటు ప్రత్యేక హోదాను కల్పిస్తామని బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన విషయాన్ని రామ్మోహన్ నాయుడు గుర్తు చేశారు.

పార్లమెంట్ వేదికగా కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అసత్యాలను మాట్లాడారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. పార్లమెంట్ సాక్షిగా ఓ ప్రధానమంత్రి ఇచ్చిన హమీలను మరో ప్రధానమంత్రి అమలు చేయలేదన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హమీని అమలు చేయాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు.

ప్రత్యేక హోదా వస్తే యువతకు ఉద్యోగాలు వస్తాయని ఆయన చెప్పారు. విశాఖలో భూములున్నా రైల్వేజోన్ ను ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైల్వేజోన్ విషయంలో కేంద్రం మోసం చేసిందని ఆయన ఆరోపించారు. 

loader