ఒక్కొక్క నియోజకవర్గంలో 5 వీవీప్యాట్‌లను ఈవీఎంల కన్నా ముందుగా లెక్కించాలన్నారు టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్. ఢిల్లీలో మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన దేశంలోని 22 పార్టీలు ఇదే విషయంపై ఎన్నికల సంఘానికి తెలిపాయన్నారు.

ఈవీఎంలు, వీవీప్యాట్‌లలో ఏమైనా తేడా ఉంటే.. మొత్తం నియోజకవర్గంలో ఉన్న వీవీప్యాట్లను లెక్కించాలని తాము ఎన్నికల సంఘాన్ని కోరాలనుకుంటున్నట్లుగా వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ కాన్‌స్టిట్యూషన్ క్లబ్బులో విపక్ష పార్టీల భేటీ జరుగుతుందని కనకమేడల వెల్లడించారు.

తమ అనుమానాలన్నీ ఎన్నికల సంఘం వద్ద క్లారిఫై చేసుకుంటామని ఆయన తెలిపారు. కౌంటింగ్ ఎప్పటి నుంచి ఎప్పటి దాకా జరుగుతుందో తెలియదని..పోలింగ్ ఏజెంట్లకు సౌకర్యాలను కల్పిస్తామని ఎన్నికల సంఘం తెలిపినట్లుగా కనకమేడల చెప్పారు. వైసీపీ కార్యకర్తలు గందరగోళం సృష్టించేందుకు సిద్ధమవుతున్నట్లుగా రవీంద్ర కుమార్ ఆరోపించారు.