నోటికేది వస్తే అది మాట్లాడే అనంతపురం టిడిపి ఎంపి జెసి దివాకర్ రెడ్డి తాజాగా చంద్రబాబునాయుడుపై పెద్ద గుండె వేశారు. మీడియాతో మాట్లాడుతూ, పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో 10 శాతం మాత్రమే అమలైనట్లు చెప్పారు. జెసి చేసిన తాజా వ్యాఖ్యలతో చంద్రబాబుతో పాటు సీనియర్ నేతలంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పోయిన ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీల్లో అన్నింటినీ అమలు చేసినట్లు ఒకవైపు పార్టీలోని నేతలందరూ ప్రజలను నమ్మించటానికి నానా అవస్తలు పడుతున్నారు. అటువంటి పరిస్ధితుల్లో జెసి ప్రకటన పెద్ద బాంబులా పేలింది.

అదే స్పీడులో జెసి మాట్లాడుతూ చంద్రబాబును వెనకేసుకొచ్చేందుకు ప్రయత్నాలు కూడా చేసారులేండి. రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికీ రాష్ట్రాన్ని అగ్రస్ధానంలో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. కేంద్రం సహకరించటం లేదని మండిపడ్డారు. నిధులు లేకుండా ప్రాజెక్టులు, రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యమని మీడియానే ఎదురు ప్రశ్నించారు. చంద్రబాబేమన్నా దేవుడా? అంటూ నిలదీసారు. రెండోసారి సిఎంగా అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తారట. సరే, బడ్జెట్ కేటాయింపుల్లో ఏపికి తీరని అన్యాయం జరిగిందని చెప్పారు లేండి. జెసి మాటలు చూస్తుంటే రెండోసారి అధికారంలోకి రావటానికి టిడిపి పెద్ద ఎత్తునే వ్యూహాలు రచిస్తున్నట్లు అర్ధమవుతోంది.