ఢిల్లీ: టీఆర్ఎస్ చీఫ్, సీఎం కేసీఆర్ ఏపీలో ప్రచారం చేస్తే తమకే లాభమని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన టీఆర్ఎస్ పార్టీ విజయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

రైతులను మెప్పించినవారిదే అధికారమని ఆకోటాలో టీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చాలా చేశారని  జేసీ కొనియాడారు. దేశంలో ఎవరూ ఇవ్వని విధంగా రైతులకు పంట పెట్టుబడి ఇచ్చారని గుర్తు చేశారు. 

హైదరాబాద్‌లో పోలింగ్ శాతం తక్కువగా ఉండటంపై జేసీ దివాకర్‌రెడ్డి సెటైర్లు వేశారు. హైదరాబాద్‌లో సూటుబూటుతో తిరిగేవాళ్లు ఓటేసేందుకే వెళ్లలేదని ఆరోపించారు. టీఆర్ఎస్ విజయం రైతులు అందించిన విజయమని అభిప్రాయపడ్డారు. 

ఈ ఎన్నికల్లో సంచి, పంచ్‌లతో లాభం లేదని ఎలాంటి ప్రలోభాలు లేకుండానే టీఆర్ఎస్ విజయం సాధించిందన్నారు. తెలంగాణ ఫలితాలపై రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉందని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.