విజయవాడలో టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ భేటీకి ఎంపీలు గల్లా జయదేవ్, రామ్మోహన్ నాయుడు, తోట సీతారామ లక్ష్మీ, కనకమేడల రవీంద్రకుమార్ హాజరయ్యారు.

ఈ సమావేశంలో దాదాపు 12 అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ప్రధానంగా అమరావతి, మూడు రాజధానులు, పోలవరం, సీఏఏ, ఎన్ఆర్‌సీ తదితర అంశాలపై చర్చించినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఎంపీ గల్లా జయదేవ్ మీడియాకు వివరించారు.

Also Rఢీల్లీకి తీర్మానం:ఇక ఏపీ శాసనమండలి రద్దు కేంద్రం చేతుల్లోనే

రాజధాని తరలింపును నిరసిస్తూ అమరావతిలో నెల రోజులుగా రైతు కుటుంబాలు ఆందోళన చేస్తున్నాయన్నారు. తాను పోలీసులపై రాళ్లు వేసినట్లు కేసు పెట్టారని, అయితే పోలీసులే సివిల్ డ్రస్సులో వచ్చి రాళ్లదాడి చేశారని గల్లా ఆరోపించారు.

ఇంత వరకు సీఎంకానీ, ఎమ్మెల్యేలు కానీ ఆందోళన చేస్తున్న రైతుల్ని కలవలేదని గల్లా జయదేవ్ మండిపడ్డారు. పోలీసులే కుట్రపూరితంగా ప్రజలను రెచ్చగొట్టి, దానిని సాకుగా చూపి లాఠీఛార్జీ చేశారని జయదేవ్ పేర్కొన్నారు.

పోలీసులు తనపైకి దూసకొస్తుంటే.. తుళ్లూరు, మందడం తదితర గ్రామాల నుంచి వచ్చిన మహిళలు రక్షణ కవచంగా నిలబడి తనను కాపాడారని జయదేవ్ గుర్తుచేశారు. ఈ సమయంలో వాళ్లకు దెబ్బలు పడ్డాయని ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు.

గుంటూరు రూరల్ ఎస్పీ, ఆక్టోపస్ ఎస్పీ ఇద్దరూ ఘటనాస్థలంలోనే ఉన్నారని తనతో పోలీసులు వ్యవహరించిన తీరును ఇద్దరు చూస్తూనే ఉన్నారని తెలిపారు. ఎంపీని అయిన తననే ఈ విధంగా ట్రీట్ చేస్తే సామాన్యుల పరిస్థితి ఏంటని జయదేవ్ ప్రశ్నించారు.

గోడు చెప్పుకోవడానికి అసెంబ్లీకి వెళ్తుంటే రైతుల్ని, మమ్మల్ని పోలీసులు అడ్డుకున్నారని ఆయన తెలిపారు. ఈ ఘటనలో బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవలని జయదేవ్ డిమాండ్ చేశారు.

Also Read:జగన్‌ కేసులో సీబీఐకి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశం

ఈ విషయాన్ని పార్లమెంటులో ప్రధాని, హోంమంత్రి, ఆర్ధిక మంత్రి, జాతీయ మానవహక్కుల సంఘం, జాతీయ మహిళా కమీషన్‌లకు ఫిర్యాదు చేస్తామని గల్లా తెలిపారు. తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతి నిర్మాణంపై ఒక విజన్ ఉందని.. రాజధాని నిర్మాణాన్ని ఎలా చేపట్టాలో తమకు ఒక ప్లాన్ ఉందన్నారు. అమరావతి నిర్మాణంలో కేంద్రం నిధులు వెచ్చించామని, అమరావతి-అనంతపురం జాతీయ రహదారి నిర్మాణం ప్రశ్నార్థకంగా మారిందన్నారు.