చాలా కాలం తర్వాత ఎంపీ గల్లా జయదేవ్ తన స్వరం వినిపించారు. టీడీపీ లో డేరింగ్ అండ్ డాషింగ్ ఎంపీగా గుర్తింపు సాధించుకున్న గల్లా జయదేవ్ గత కొద్ది రోజులుగా కనిపించడం మానేసారు. ఓ వైపు రాజధాని వికేంద్రీకరణ, మరో వైపు అమరావతి రైతుల ఆందోళనలు, కరోనా వైరస్ వ్యాప్తి, కీలక నేతల పార్టీల మార్పులతో ఏపీ రాజకీయాలు హీటెక్కుతుండగా... గల్లా గత కొంతకాలంగా వీటిపై స్పందించింది లేదు.

ఈ నేపథ్యంలో.. గల్లా కనపడం లేదు.. గల్లా జయదేవ్ ఎక్కడికి వెళ్లారు అనే ప్రశ్నలు తలెత్తాయి. ఆయన ఎక్కడున్నారో కూడా తెలియదని అంటున్నారు. కనీసం ఫోన్‌కు కూడా అందుబాటులో లేరని అమరావతి ప్రాంత టీడీపీ నేతలే విరుచుకుపడే పరిస్థితి ఉంది. పలు మీడియా సంస్థల్లో ఈ మేరకు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా.. గల్లా జయదేవ్ స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ఏపీ ప్రభుత్వం విఫలమైందంటూ తప్పు పట్టారు. సీఎం జగన్ పై విమర్శలు కురిపించారు.

‘‘కరోనా నియంత్రణలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమయింది. సాక్షాత్తు సీఎం జగన్మోహన్‌రెడ్డే మాస్కు పెట్టుకోకుండా తిరుగుతుంటే సామాన్యుల పరిస్థితి ఏమిటి?’’ అని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ ఒక ప్రకటనలో ప్రశ్నించారు. మంత్రులు, ఎమ్మెల్యేలే కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘిస్తూ కరోనా ఉధృతికి దోహదపడుతున్నారని ఆరోపించారు. 

కాగా.. రాజధాని విషయంలో కూడా గల్లా తన వైఖరి తెలియజేస్తారని ఆశిస్తున్నారు.