అమరావతి: శాసనమండలిలో నిన్న జరిగిన పరిణామాలు తనను కలిచివేసినట్టుగా మండలిలో విపక్షనేత యనమల రామకృష్ణుడు చెప్పారు. ఆరుసార్లు అసెంబ్లీలో, రెండు దఫాలుగా కౌన్సిల్ లో సభ్యుడిగా ఉన్నా కూడ తాను ఏనాడూ కూడ ఇలాంటి ఘటనలు చూడలేదన్నారు.

అధికార పార్టీ నేతలు ఇలా అరాచకాలకు పాల్పడడాన్ని తాను ఏనాడూ కూడ చూడలేదన్నారు. 34 ఏళ్లుగా చట్టసభల్లో ప్రత్యక్షంగా ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మంత్రులు తొడగొట్టడం, పోడియం చుట్టుముట్టడం, ప్రతిపక్ష సభ్యులపై మంత్రులే దాడిచేయడం, మంత్రులు దుర్భాషలాడడం వైసీపీ కల్చర్‌కు నిదర్శనంగా పేర్కొన్నారు.

ఏనాడూ కూడ అన్‌పార్లమెంటరీ భాష తాను వాడలేదు, విధ్వంసం చేస్తామని మాట అని నేను అనలేదన్నారు. అవసరమైతే రికార్డులు చూసుకోవాలని ఆయన సవాల్ విసిరారు. విధ్వంసాలు, విచ్ఛిన్నాల పేటెంట్ వైసిపిదేనని ఆయన అన్నారు.

దాడులు, దౌర్జన్యాలు వైసిపి నిత్యకృత్యాలు.  మేము తల్చుకుంటే తోలు తీస్తాం అని మంత్రులే అన్నారు. ఎవరి తోలు ఎవరు తీస్తారు..? ప్రజలే మీ తోలు తీస్తారనేది గుర్తుంచుకోవాలన్నారు.

మంత్రులే ద్రవ్య వినిమయ బిల్లుకు అడ్డం పడటం ఎక్కడైనా ఉందా..? ద్రవ్య వినిమయ బిల్లు పెట్టాలని ప్రతిపక్షం 3గంటల పాటు అడగటం, అధికార పార్టీ తిరస్కరించడం 70ఏళ్ల భారత ప్రజాస్వామ్య చరిత్రలో లేదు. అప్రాప్రియేట్ బిల్లుకన్నా ఆ 2బిల్లులే వైసిపికి ప్రాధాన్యమా అని ఆయన ప్రశ్నించారు. 

రాజధాని తరలింపు అంశం లెజిస్లేచర్ ప్రాసెస్ లో ఉందని గవర్నర్ ప్రసంగంలో చెప్పారు. సెలెక్ట్ కమిటి వద్ద ఉందని అటార్నీ జనరల్ హైకోర్టుకు అఫిడవిట్ లో చెప్పారని ఆయన గుర్తు చేశారు. హైకోర్టుకు ఇచ్చిన అఫిడవిట్ వైసిపి దృష్టిలో చెత్తకాగితమా..? ఇది కోర్టు ధిక్కరణ కాదా..? ..కోర్టు ధిక్కరణల్లో కూడా వైసిపిదే రికార్డు అంటూ ఆయన ఎద్దేవా చేశారు. 

 ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికే తాము పోరాడుతున్నామన్నారు.  లెజిస్లేచర్, అడ్మినిస్ట్రేషన్, జ్యుడిషీయరీ, మీడియా విధ్వంసమే లక్ష్యంగా వైసిపి అకృత్యాలు సాగిస్తోందని చెప్పారు. 

రాజ్యాంగంపై వైసిపికి గౌరవం లేదు, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. మీ అరాచకాలకు ప్రజాక్షేత్రంలోనే తగిన గుణపాఠం తప్పదని యనమల రామకృష్ణుడు హెచ్చరించారు.