అమరావతి: ఇటీవల జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించబోతుందని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో కంటే టీడీపీకి అత్యధిక సీట్లు గెలుస్తామన్నారు. 

అమరావతిలో మీడియాతో మాట్లాడిన రాజేంద్రప్రసాద్ టీడీపీ 120 ఎమ్మెల్యే, 20 ఎంపీ సీట్లతో గెలవబోతుందని జోస్యం చెప్పారు. మే 23న జగన్‌కి ఆశాభంగం తప్పదని....చంద్రబాబే మళ్లీ సీఎం అవుతారన్నారు. చంద్రబాబు సీఎం అవుతన్నారని తెలిసే జగన్ ను కేసీఆర్ హైదరాబాద్ నుంచి అమరావతికి తరిమేశారని వ్యాఖ్యానించారు. 

ఫలితాల తర్వాత మోదీ గుజరాత్ కు, వైఎస్ జగన్ లోటస్ పాండ్ కు వెళ్లకతప్పదని హెచ్చరించారు. మోదీ, వైఎస్ జగన్ లు వ్యవస్థలను భ్రష్టుపట్టించారంటూ ధ్వజమెత్తారు. టీడీపీ అధికారంలోకి రాగానే జగన్, విజయసాయిరెడ్డిలను జైలుకు పంపించడం ఖాయమన్నారు. 

వారిద్దరిని చంచల్ గూడ జైలుకుపంపుతామని వార్నింగ్ ఇచ్చారు. విజయసాయిరెడ్డి రాష్ట్రానికి విషపుసాయిరెడ్డిలా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకపోతే పోలవరం ప్రాజెక్టుకు కాంగ్రెస్ సీనియర్ నేత కకేవీపీ రామచంద్రరావు సైంధవుడిలా మారి అడ్డుపడుతున్నారంటూ మండిపడ్డారు. 

చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో రీ పోలింగ్ పెట్టాలని గతంలోనే తాము డిమాండ్ చేస్తే అప్పుడు స్పందించని ఎన్నికల సంఘం వైసీపీ ఫిర్యాదు ఇచ్చిన వెంటనే స్పందించడం వెనుక అంతరార్థం ఏంటని నిలదీశారు.