అమరావతి: ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరహార దీక్ష చేస్తానని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట ఏమైందని  టీడీపీ ఎమ్మెల్సీ వైబీ రాజేంద్రప్రసాద్ ప్రశ్నించారు. ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ఆనాడు కాంగ్రెస్‌కు హోల్‌సేల్‌గా అమ్మేశారని, జనసేనను  పవన్ కళ్యాణ్  మోడీకి రీటైల్‌గా అమ్ముకొన్నారని  ఆయన  విమర్శించారు.

సోమవారం నాడు  ఆయన   అమరావతిలో మీడియాతో మాట్లాడారు.  ప్యాకేజీ కోసం పవన్ కళ్యాణ్, కేసుల మాఫీ కోసం జగన్  తమ పార్టీలను  ప్రధాని మోడీ వద్ద తాకట్టు పెట్టారని ఆయన మండిపడ్డారు. 

ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోందని మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ చేసిన విమర్శలకు ఆయన ఘాటుగానే సమాధానమిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి పదవిని అనుభవించిన సమయంలో  పురంధేశ్వరీకి ఎన్టీఆర్ ఆత్మక్షోభించిన విషయం గుర్తు లేదా అని ఆయన ప్రశ్నించారు.  ఉద్దేశ్యపూర్వకంగానే టీడీపీని లక్ష్యంగా చేసుకొని వైసీపీ, జనసేన, బీజేపీలు విమర్శలు గుప్పిస్తున్నాయని  రాజేంద్రప్రసాద్ అభిప్రాయపడ్డారు.

ఏపీ రాష్ట్ర ప్రయోజనాల కోసం  అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నామని రాజేంద్రప్రసాద్ చెప్పారు. తమ పోరాటానికి కలిసిరాకుండా విపక్షాలు కేంద్రానికి సహకారాన్ని అందిస్తున్నాయని ఆయన ఆరోపణలు గుప్పించారు.