అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర అరెస్ట్ పై టిడిపి జాతీయ ప్రదాన కార్యదర్శి నారా లోకేష్ సీరియస్ గా స్పందించారు. ఇలా అక్రమ కేసులు బనాయించి రవీంద్ర ఈక కూడా పీకలేరంటూ సీఎం జగన్, మంత్రి పేర్ని నానిలపై సోషల్ మీడియా వేదికన విరుచుకుపడ్డారు లోకేష్. 

''సౌమ్యుడు,వివాద రహితుడైన కొల్లు రవీంద్ర అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. మంచి సీఎం రాష్ట్ర అభివృద్ధితో ఆనందాన్ని పొందుతాడు. మూర్ఖపు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేసి రాక్షస ఆనందం పొందుతాడు'' అంటూ ట్విట్టర్ వేదికన లోకేష్ ఆరోపించారు. 

''కోడికత్తి జగన్ రెడ్డి, తాపీకత్తి నాని కలిసి కొల్లు రవీంద్ర ఈక కూడా పీకలేరు. మీరు ఎంత అణిచినా ఉప్పెనలా టిడిపి సైన్యం మీపై పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది. అధికార మదంతో వైకాపా నేతలు చెప్పినట్టు ఆడుతున్న కొంతమంది అధికారులు జగన్ రెడ్డితో కలిసి చిప్పకూడు తినడానికి సిద్ధంగా ఉండాలి'' అని లోకేష్ హెచ్చరించారు. 

read more   మచిలీపట్నంలో హైటెన్షన్... కొల్లు రవీంద్ర బలవంతంగా లాక్కెళ్లిన పోలీసులు

తీవ్ర ఉద్రిక్తత నడుమ మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్రను గురువారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేసారు.బుధవారం మున్సిపల్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మచిలీపట్నంలో 25వ పోలింగ్ బూత్ వద్దకు వెళ్తున్న కొల్లు రవీంద్రను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, రవీంద్రకు మధ్య వాగ్వాదం జరగింది. ఈ క్రమంలోనే పోలీసులను రవీంద్ర తోసేయగా వారు కూడా ఆయనను తోశారు. పోలీసుల తీరుకు నిరసనగా రవీంద్ర అక్కడే నేల మీద కూర్చొని నిరసన తెలిపారు. 

అయితే ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు గురువారం ఉదయం రవీంద్ర ఇంటికి భారీగా చేరుకుని అయనను బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని వెళ్లారు. ఎన్నికల విధులకు ఆటంకం కల్పించారని ఆయనను అదుపులోకి తీసుకోనున్నట్లు పోలీసులు తెలిపారు.