తాను జగన్ రెడ్డికి సవాల్ విసిరితే వేరేవాళ్లు మొరగడం ఏంటని ప్రశ్నించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్. ప్రమాణం చేయడానికి ఏ1కి దమ్ము, ధైర్మం లేదా అని లోకేశ్ ప్రశ్నించారు.

దైవం మీద ప్రమాణం అంటే వెనక్కి పారిపోతున్నారు అంటూ లోకేశ్ ఎద్దేవా చేశారు. తనపై ముఖ్యమంత్రి జగన్ చేయిస్తున్న ఆరోపణలు అవాస్తవని నారా లోకేష్ ధ్వజమెత్తారు. సింహాద్రి అప్పన్నపై ప్రమాణానికి తాను సిద్ధమని.... జగన్ సిద్ధమా అని అంటూ లోకేష్ సవాల్ విసిరారు.

అంతకుముందు లోకేశ్ సవాల్‌ను స్వీకరించారు విజయసాయిరెడ్డి. చర్చకు మీరే డేట్ ఫిక్స్ చేయాలని ఆయన కోరారు. ఆలయాలపై దాడుల్లో టీడీపీ నేతల పాత్ర ఉందో లేదో చర్చిద్దామని విజయసాయి స్పష్టం చేశారు.

తాను ఆలయాన్ని పరిశీలించి వస్తుండగా కళా వెంకట్రావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు తన కారు అద్దాలు పగుల గొట్టారని ఆయన ఆరోపించారు. ఇలాంటి ఘటనలు చట్ట విరుద్ధమని.. దీనికి సంబంధించి పోలీసులకు ఫిర్యాదు చేస్తామని సాయిరెడ్డి స్పష్టం చేశారు.

Also Read:రామతీర్థం: విజయసాయిరెడ్డి కారుపై టీడీపీ కార్యకర్తల రాళ్ల దాడి

సీఎం జగన్ సుపరిపాలన అందిస్తున్నారని.. తాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఆలయాన్ని పునరుద్ధరణ చేస్తామని దీనికి రూ.2 కోట్లు అవుతుందని అందుకు సంబంధించిన నిధులు మంజూరు చేస్తామని దేవాదాయ శాఖ మంత్రి చెప్పారని విజయసాయి గుర్తుచేశారు.

రాష్ట్రంలో ఆలయ వ్యవస్థను నిర్వీర్యం చేసిందే చంద్రబాబని.. ఆయన హయాంలో 20 వేల ఆలయాలు మూతపడే పరిస్ధితి వచ్చిందని ఆయన ఆరోపించారు. తిరుమలలో 1000 కాళ్ల మండపాన్ని చంద్రబాబు తొలగించారని.. బెజవాడలో 39 గుళ్లను కూలగొట్టించారని ఎద్దేవా చేశారు.