విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం శనివారం రణరంగంగా మారింది. ఆలయంలో రాముని విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను పరిశీలించేందుకు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, బీజేపీ నేతలు ఒకేసారి అక్కడికి చేరుకోవడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.

తొలుత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రామతీర్థం ఆలయాన్ని పరిశీలనకు వెళ్లతున్నట్లు ప్రకటించిన వెంటనే.., వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి రామతీర్థం వెళ్లారు. చంద్రబాబు కంటే ముందే రామతీర్థం చేరుకున్న ఆయన.., కొండపైన ఆలయాన్ని దర్శించారు.

Also Read:చలో రామతీర్థం: బాబు కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు.. ఉద్రిక్తత

ఘటనపై స్థానిక అధికారులు, పోలీసులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే విజయసాయి రెడ్డి రాకను టీడీపీ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా వ్యతిరేకించారు. రాజకీయం చేయడానికే విజయసాయి రెడ్డి వచ్చారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. వేలాది మంది కార్యకర్తలు దూసుకురావడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది.

విజయసాయి రెడ్డి కొండదిగి వచ్చిన తర్వాత ఆయన వాహనంలోకి వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈక్రమంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య స్వల్ప తోపులాట జరిగింది.

ఇదే సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు విజయసాయి రెడ్డి వాహనంపై రాళ్లు, చెప్పులతో దాడికి పాల్పడ్డారు . మరోవైపు విజయసాయి రెడ్డిని కొండపైకి అనుమతించి తమను ఎందుకు అనుమతించలేదని బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై వాగ్వాదానికి దిగారు.