ఏపీలో విద్యుత్ కోతలపై సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు టీడీపీ నేత నారా లోకేష్. ఇప్పటికైనా సమీక్షలు నిర్వహించి రాష్ట్రంలో పవర్ హాలిడేని ఎత్తేయాలంటూ లోకేష్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని విద్యుత్ కోతలపై (power cuts) టీడీపీ (tdp) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేశ్ (nara lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కోతలతో రాష్ట్రంలోని అన్ని రంగాలు తీవ్రంగా నష్టపోతున్నాయని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పవర్ హాలీడేలను ఎత్తివేయాలని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (ys jagan mohan reddy) లోకేష్ కోరారు. ఈ మేరకు సీఎం జగన్‌కు నారా లోకేశ్ బుధవారం బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు వరుస ట్వీట్లు చేసిన లోకేశ్.. విద్యుత్ కోతలతో రాష్ట్రం ఎదుర్కొంటున్న ఇబ్బందులను అందులో ప్రస్తావించారు.
‘‘ పరిశ్రమలు, ఉపాధి కల్పనా రంగాలని సంక్షోభంలోకి నెట్టే పవర్ హాలిడేని ఎత్తేయాలంటూ సీఎం జగన్ గారికి లేఖ రాసాను. 5 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏనాడు కరెంట్ కోతలు లేవు. కానీ మీరు సీఎం అయ్యాక విద్యుత్ రంగాన్ని నాశనం చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టారు.’’
‘‘ పరిశ్రమల్లో ఉత్పత్తి నిలిపివేయడం ద్వారా నెలవారీ అద్దెలు, చెల్లించాల్సిన వాయిదాలు, అప్పులకు వడ్డీలు కట్టలేక యాజమాన్యాలు విలవిల్లాడుతున్నాయి. విద్యుత్ కోతలతో గ్రానైట్, ఆక్వా, పౌల్ట్రీ, వస్త్ర, ఆహార పరిశ్రమలు తీవ్రంగా నష్టపోయాయి’’.
‘‘ ఇప్పటికైనా ఉన్నతాధికారులతో సమీక్షించి పవర్ హాలీడేని ఎత్తేసే మార్గం ఆలోచించండి. వాణిజ్య, పరిశ్రమల వినియోగదారుల నెత్తిన పెను భారాన్ని మోపుతూ ఎనర్జీ డ్యూటీ ని 6 పైసల నుండి రూపాయికి పెంచి సుమారుగా రూ.3 వేల కోట్లు దోచుకునే నిర్ణయాన్ని కూడా వెనక్కి తీసుకుని పరిశ్రమలని కాపాడండి’’ అంటూ లోకేష్ ట్వీట్ చేశారు.
మరోవైపు... ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం భారీ నజరానా ప్రకటించింది. రాష్ట్రంలో విద్యుత్ సంస్కరణలు అమలు చేసి డిస్కంల నష్టాలు తగ్గించి, విద్యుత్ రంగం ఆర్థిక సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసినందుకు గాను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి భారీ ప్రోత్సాహకాన్ని వెల్లడించింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేసిన సానుకూల ఫలితాలు రాబట్టిన పది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకం ప్రకటించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బహిరంగ మార్కెట్ నుంచి రూ. 3,716 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం మొత్తం పది రాష్ట్రాలకు ఈ ప్రోత్సాహం ప్రకటించింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 28,204 కోట్ల అదనపు రుణం తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఇందులో భాగంగా రూ. 3,716 కోట్ల అదనపు రుణాన్ని బహిరంగ మార్కెట్ నుంచి తీసుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం అనుమతి ఇచ్చింది. అత్యధికంగా తమిళనాడుకు రూ. 7,054 కోట్లు, ఆ తర్వాత వరుసగా ఉత్తరప్రదేశ్‌కు రూ. 6,823 కోట్ల, రాజస్తాన్‌కు రూ. 5,186 కోట్ల రుణ సౌకర్యాన్ని ప్రకటించింది. ఈ రాష్ట్రాల తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నది.
గత ఆర్థిక సంవత్సరంలో ఈ అదనపు రుణాన్ని ఏపీ సహా పది రాష్ట్రాలు వాడుకున్నాయి. ఏపీకి 2021-22 ఆర్థిక సంవత్సరంలో మొత్తం రూ. 46,443 కోట్ల బహిరంగ రుణానికి అనుమతి ఇచ్చింది. కాగా, అందులో పెట్టుబడి వ్యయంతో రూ. 5,309 కోట్లను ముడిపెట్టింది. విద్యుత్ సంస్కరణలు అమలు చేసినందుకు గాను రూ. 3,716 కోట్లు తీసుకోవచ్చని కేంద్రం తెలిపింది. మిగిలిన రూ. 37,418 కోట్లు నేరుగా బహిరంగ మార్కెట్ రుణాలుగా తీసుకునే వెసులుబాటు కల్పించింది.
