తిరుపతి: కొడుకు వైఎస్ జగన్ చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవాలన్న ఆరాటంతోనే వైఎస్ విజయమ్మ లేఖల పేరిట నాటకాలు ఆడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. తన తండ్రి వివేకానంద రెడ్డిని చంపిన నిందితులను శిక్షించాలని రెండు ఏళ్లుగా సునీతా రెడ్డి చేస్తున్న ఆందోళన మీకు ఇవాళ కనిపించిందా? అని మంతెన నిలదీశారు. 

''వివేకాహత్య కేసులో న్యాయం చేయని జగన్ రెడ్డిని వదలిపెట్టి, వాస్తవాలు రాసిన మీడియాను తప్పు పట్టడం మీ కుటిల నీతికి నిదర్శనం కాదా? విజయమ్మ బహిరంగ లేఖలు రాయటం కాదు, నిందితుల్ని కాపాడుతున్నందుకు జగన్ మోహన్  రెడ్డిని నిలదీయాలి. తిరుపతి ఎన్నికల్లో మీ కొడుకు బండారం బయటపడుతుందని ఈ లేఖలు రాస్తున్నారు'' అని మంతెన పేర్కొన్నారు. 

read more  వైఎస్ వివేకానందరెడ్డి హత్యలో నిజాలు నిగ్గు తేలాల్సిందే: విజయమ్మ బహిరంగ లేఖ

విజయమ్మ లేఖపై టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిపట్ల సూర్యప్రకాష్ మాట్లాడుతూ... జగన్ ఒక చెల్లిని మోసం చేసి హైదరాబాద్ లో, మరోక చెల్లిని డిల్లీలో వదిలేశారని అన్నారు. మీ కుమార్తెలకు న్యాయం చేయలేని జగన్ ని  మీరెందుకు నిలదీయటం లేదు? అని అంటూ విజయమ్మను ప్రశ్నించారు. నాడు సీబీఐ  విచారణ కావాలన్న జగన్ ఇప్పుడు విచారణను ఎందుకు ముందుకు కదలనివ్వడంలేదు? సిట్ విచారణ వేగంగా జరుగుతుంటే దాన్ని అడ్డుకుంది మీ జగన్ కాదా? అంటూ విజయమ్మను సూర్యప్రకాష్ నిలదీశారు.