చంద్రబాబుకు ఎంఎల్సీ కరణం షాక్

First Published 5, Apr 2018, 12:21 PM IST
TDP MLC Karanama slams chandrababu Naidu for  apathy on Prakasam district
Highlights
శాసనమండలి సమావేశాల్లోనే టిడిపి ఎంఎల్సీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడటంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది.

చంద్రబాబునాయుడు పరువును సొంత పార్టీ నేతలే  రోడ్డుమీదకు లాగేస్తున్నారు. ప్రపంచదేశాలన్నీ ఏపి వైపు చూస్తున్నాయని, లక్షలకోట్ల రూపాయల పెట్టుబడులతో రాష్ట్రమంతా అభివృద్ధి చేస్తున్నామన్న చంద్రబాబు ప్రకటనలన్నీ డొల్లే అన్నట్లు టిడిపి ఎంఎల్సీ తేల్చేశారు. శాసనమండలి సమావేశాల్లోనే టిడిపి ఎంఎల్సీ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడటంతో పార్టీలో ఒక్కసారిగా కలకలం రేగింది.

ఇంతకీ జరిగిందేమిటంటే, ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో పరిశ్రమల ఏర్పాటు గురించి ఎంఎల్సీ కరణం బలరాం ఓ ప్రశ్న వేశారు. అందుకు పరిశ్రమలశాఖ మంత్రి అమరనాధరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుతానికి అటువంటి ప్రతిపాదనలేవీ లేవని సమాధానం ఇచ్చారు. దాంతో కరణం ఒక్కసారిగా రెచ్చిపోయారు.

జిల్లాకు వచ్చిన పరిశ్రమలన్నింటినీ తిరుపతి, వైజాగ్, గన్నవరం ప్రాంతాలకు తీసుకెళుతుంటే దొనకొండకు పరిశ్రమలు ఎలా వస్తాయంటూ మండిపడ్డారు. దొనకొండ ప్రాంతంలోనే రాజధాని వస్తుందని జనాలు ఆశించారన్నారు. రాజధానిని అమరావతికి తరలించినా పరిశ్రమలన్నా వస్తే దొనకొండ ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని అనుకుంటే చివరకు అదికూడా జరగటం లేదని ధ్వజమెత్తారు.

ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళవుతున్నా ఇంత వరకూ ఒక్క పరిశ్రమ కూడా రాకపోతే రేపటి ఎన్నికల్లో జనాలకు ఏమని సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. అసలు 13 జిల్లాల ఏపి మ్యాప్ నుండి ప్రకాశం జిల్లాను తొలగించారా? అంటూ మంత్రిపై మండిపడ్డారు. వెనుకబడిన జిల్లాకు ప్రాధన్యత ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఎలాగంటూ ధ్వజమెత్తారు. ఎంఎల్సీ ఆగ్రహంతో బిత్తరపోయిన మంత్రి త్వరలోనే జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామంటూ ఏదో మొక్కుబడి సమాధానం చెప్పేశారు.

loader