గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మండిపడ్డాడు. వల్లభనేని వంశీ నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. డాక్టర్ రమేష్ పై చేసిన కామెంట్స్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

ఇటీవల విజయవాడలో స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం సంభవించి దాదాపు 9మంది కోవిడ్ రోగులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాల్లో వివాదం తలెత్తింది. ప్రభుత్వానిదే తప్పు అంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తుండగా.. రమేష్ ఆస్పత్రి తప్పిదమేనంటూ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ క్రమంలో  రమేష్ ఆస్పత్రిపై తాజాగా వల్లభనేని వంశీ పలు ఆరోపణలు చేశారు.

కాగా.. వాటిని వెనక్కి తీసుకోవాలంటూ బచ్చుల మండిపడ్డారు. జగన్ వేసే బిస్కెట్లకు ఆశపడి వంశీ ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఆరోపించారు.  స్వర్ణ హోటల్ ప్రమాదంతో రమేష్ ఆస్పత్రి యాజమాన్యానికి ఎటువంటి సంబంధం లేదని ఆయన అన్నారు.  ప్రభుత్వం కోరిన మీదటే స్వర్ణ హోటల్‌లో కోవిడ్ సెంటర్‌ను రమేష్ పెట్టారని ఆయన అన్నారు.

 హోటల్‌లో కోవిడ్ ఆస్పత్రి పెట్టేముందు తనిఖీలు చేయడం ప్రభుత్వానికి బాధ్యత కాదా అని ప్రశ్నించారు.  ఏపీలో వైద్యశాఖ నిద్రపోతోందా అని అడిగారు.  ముందూ వెనుకా చూసుకోకుండా వల్లభనేని వంశీ తాడేపల్లి స్క్రిప్ట్ చదివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.