బుగ్గనకు షాకిచ్చిన టిడిపి 


అమరావతి: పీఏసీ ఛైర్మెన్‌ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసును టిడిపి ఎమ్మెల్యేలు ఇచ్చారు. బుధవారం నాడు టిడిపి ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, హనుమంతరాయచౌదరిలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిపై ప్రివిలేజ్ నోటీసును ఇచ్చారు. ఈ మేరకు స్పీకర్‌కు కాపీని అందజేశారు.

పీఏసీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వారం రోజుల క్రితం బిజెపి నేత రామ్‌మాధవ్‌కు ఏపీకి చెందిన కొన్ని కీలక పత్రాలను అందించారని టిడిపి ఎమ్మెల్యేలు ప్రివిలేజ్ నోటీసులు ఆరోపించారు. న్యూఢిల్లీలో పీఏసీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణతో కలిసి రామ్‌మాధవ్ సహా ఇతర బిజెపి నేతలను కలిసి ఏపీకి చెందిన సమాచారాన్ని ఇచ్చారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులో ఎమ్మెల్యేలు ప్రస్తావించారు.

రెండు రోజుల క్రితం టిడిపి ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, ఎంపీ కనకమేడల రవీంద్రపై పీఏపీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సభా హక్కుల ఉల్లంఘన నోటీసును ఇచ్చారు. ఈ నోటీసుకు కౌంటర్‌గా టిడిపి ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్ రెడ్డి, హనుమంతరాయ చౌదరిలు బుధవారం నాడు ప్రివిలేజ్ మోషన్ నోటీసు ఇచ్చారు.

న్యూఢిల్లీలో పీఏసీ ఛైర్మెన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిజెపి నేత రామ్ మాధవ్ ను కలిసినట్టుగా తమ వద్ద ఆధారాలున్నాయని టిడిపి నేతలు చెబుతున్నారు. ఈ మేరకు లాగ్ బుక్ లో ఉన్న సమాచారంతో పాటు కారు డ్రైవర్ ఇచ్చిన సమాచారాన్ని కూడ టిడిపి నేతలు గుర్తు చేశారు. రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు ఒకరిపై మరోకరు పోటా పోటీగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చారు.