అమరావతిలో తాను బినామీ పేర్లతో పొలాలు కొనుగోలు చేసినట్లు తెలితే తన ఆస్తులన్నింటినీ జప్తు చేసుకోవచ్చునని సవాల్ విసిరారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై చర్చ సందర్భంగా పయ్యావుల అసెంబ్లీలో మాట్లాడారు.

అమరావతి ప్రాంతంలో తనతో పాటు ఎవరైనా బినామీలతో ఆస్తుల్ని కొన్నట్లు తేలితే చట్టప్రకారం చర్యలు తీసుకోవచ్చునని కోరారు. దీనికి కౌంటర్ ఇచ్చారు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. బినామీ చట్టాన్ని అమలు చేయడం అంత తేలిక కాదన్నారు.

Also Read:రాజధాని గ్రామాల్లో పర్యటనకు పవన్ సిద్దం: జనసేన ఆఫీస్ వద్ద టెన్షన్

అమరావతిని తరలించాలని భావించిన వెంటనే ఇందుకోసం ఎన్నో మార్గాలను వెతికారని దీనిలో భాగమే బినామీ ఆస్తులని పయ్యావుల మండిపడ్డారు. ఒక కుక్కను చంపాలంటే ఆ కుక్క పిచ్చిది, పిచ్చిది అని ప్రచారం చేయ్యాలో అదే రకంగా అమరావతిలో అక్రమాలు జరిగాయని చెప్పిందే చెబుతున్నారని కేశవ్ ధ్వజమెత్తారు. 

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఐనవోలు గ్రామంలో పయ్యావుల విక్రమ్ సింహా పొలాలు కొనుగోలు చేసినట్లు ఆధారాలున్నాయన్నారు మంత్రి బుగ్గన. ఎక్కడో అనంతపురంలో ఉండే విక్రమ సింహ.. విజయవాడ, గుంటూరు లాంటి నగరాలను కాదని ఐనవోలులో పొలం ఎందుకు కొన్నారని మంత్రి ప్రశ్నించారు.

అమరావతిని రాజధానిగా నిర్ణయిస్తూ రాష్ట్ర కేబినెట్ 01.09.2014న ఆమోదముద్ర వేసిందని, 04.09.2014న అసెంబ్లీలో చర్చ జరిగిందని పయ్యావుల కేశవ్. 13.10.14న రాజధాని ప్రకటనకు 40 రోజుల అనంతరం తాను భూమిని కొనుగోలు చేసినట్లు కేశవ్ తెలిపారు.

Also Read:ఏపీకి 3 రాజధానులు: ఏ నగరానికి ఏమేమి దక్కుతాయంటే...

దీనికి వెంటనే స్పందించిన మంత్రి బుగ్గన.. ఏపీసీఆర్డీఏ బిల్లు ఆమోదం పొందకుండా, గ్రామాలు నోటిఫై చేయకుండానే పయ్యావుల భూమిని కొనుగోలు చేశారా అని నిలదీశారు. రాష్ట్ర రాజధాని ఇదే ప్రాంతంలో వస్తుందని పేపర్లలో వచ్చిందని ఆ తర్వాతే తాను భూమి కొనుగోలు చేశానని పయ్యావుల వెల్లడించారు. 

విచారణలో నిజానిజాలు ఎప్పటికైనా తేలతాయని ఆయన స్పష్టం చేశారు. రాజధాని గ్రామాలు ఏవో సాక్షి పత్రికకు ఎలా తెలిశాయో పయ్యావుల ప్రశ్నించారు. అమరావతితో పాటు విశాఖ భూముల కొనుగోలు వ్యవహారాలపై నా విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

శివరామకృష్ణన్ కమిటీ భూమి విషయంలో విజయవాడకు తక్కువ మార్కులు వేసింది కానీ.. నీరు, రవాణా సదుపాయాల విషయంలో మాత్రం ఎక్కువ మార్కులు వేసిందని పయ్యావుల గుర్తుచేశారు.