వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సండూర్ పవర్‌ లిమిటెడ్ మరోసారి వార్తల్లోకి ఎక్కింది. ఏపీ శాసనసభ సమావేశాల్లో భాగంగా మంగళవారం అసెంబ్లీ లాబీల్లో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ మీడియాతో మాట్లాడుతూ.. పీపీఏల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి మింగుడుపడటం లేదని.. కేంద్రం వైఖరి రాష్ట్ర ప్రభుత్వ విశ్వసనీయతను దెబ్బతీసిందన్నారు.

అందుకనే విశ్వసనీయత లేని పీపీఏల సమీక్ష అంశంపై విశ్వసనీయత ఉన్న అజేయ కల్లంతో మీడియా సమావేశం పెట్టించారని పయ్యావుల ఎద్దేవా చేశారు. తద్వారా విశ్వసనీయత సంపాదించుకునే ప్రయత్నం చేశారని ఆయన పేర్కొన్నారు.  

జగన్ కుటుంబానికి చెందిన సండూర్ పవర్ లిమిటెడ్‌కు కర్ణాటక ప్రభుత్వం ఒక యూనిట్‌ విద్యుత్‌కు రూ.4.50 పైసలు ఇస్తోందని.. అక్కడ ఫ్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ ఏపీ కంటే 3 శాతం ఎక్కువగా ఉందని .. అందుకే మన రాష్ట్రం కంటే 33 పైసలు తక్కువగా ఉందని కేశవ్ తెలిపారు.

అయితే దీనిపై అజేయ కల్లం అసత్యాలు మాట్లాడరని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి కూడా ఈ విషయాలపై అవగాహన, స్పష్టత ఉన్నాయన్నారు. అయితే వీరిద్దరూ వాస్తవాలు చెప్పలేక ఇబ్బందులు పడుతున్నట్లు అనిపిస్తోందని పయ్యావుల వ్యాఖ్యానించారు.

ఎనర్జీ రెగ్యులేటరీ కమిషన్ ఆధ్వర్యంలోనే పీపీఏలన్నీ జరుగుతాయన్న ఆయన విద్యుత్ ఉత్పత్తి కంపెనీలు, డిస్కంలు, ప్రజలు.. ఇలా అన్ని పార్టీల వాదనలు విని ఈఆర్‌సీనే ధరను నిర్ణయింస్తుందన్నారు.

ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేస్తానంటున్న న్యాయకమిషన్ లాంటిదే ఈఆర్‌సీ కూడా అని అన్నారు. న్యాయ కమిషన్ రాష్ట్ర చట్టం ప్రకారం వస్తే.. ఈఆర్‌సీ పార్లమెంట్ చట్టం ద్వారా వచ్చిందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అన్ని తెలుసునని.. లోతుగా ఆలోచిస్తే అన్నీ ఆయనకే అర్ధమవుతాయని అనుకుంటున్నానని పయ్యావుల వ్యాఖ్యానించారు.