అధికారంలో ఉండి కూడా వైసీపీ నేతలకు అసెంబ్లీకి రాలేని పరిస్థితి ఏర్పడిందని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

 ఈ సందర్భంగా ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శలు కురిపించారు. సభను సమర్థవంతంగా నడపలేని దుస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అన్నారు. కొత్త ప్రభుత్వానిది అవగాహన రాహిత్యమని... ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేని స్థితిలో కొత్త ప్రభుత్వం ఉందని ఆరోపించారు.

అసెంబ్లీకి మంత్రులు హాజరుకాక కొద్ది సేపు సభ వాయిదా వేశారని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ కి ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ప్రతిపక్షంలోనూ.. అధికారంలోనూ అసెంబ్లీకి రాలేని పరిస్థితిలో వైసీపీ నేతలు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయన్నారు.

ప్రజా వేదిక కూల్చివేత విషయంలో ప్రజలకు చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. అక్రమ కట్టడాలపై ప్రభుత్వ నిర్ణయం ఏమిటో స్పష్టంగా తెలియజేయాలని డిమాండ్ చేశారు. నదీ పరివాహక ప్రాంతంలోనూ టూరిజం రిసార్ట్స్ కట్టారని గుర్తు  చేశారు. వీటిపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని అనుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు.