అమరావతి: పొరుగురాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాడని పోలవరం ప్రాజెక్ట్ ని ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బ్యారేజీగా మార్చేశాడని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పోలవరం ఎత్తుని 150 అడుగులనుంచి 135 అడుగులకు తగ్గించడం రైతులకు మేలుచేయడం ఎలా అవుంతుందని నిమ్మల నిలదీశారు. 

''వైసీపీ ప్రభుత్వం రైతు దగా, రైతు ద్రోహ ప్రభుత్వమని చెప్పడానికి రెండేళ్ల పాలనే నిదర్శనం. ముఖ్యమంత్రి విడుదలచేసిన పుస్తకంలో రైతులకు చేసిన సాయం కన్నా మోసమే ఎక్కువగా ఉంది. రైతులకు, వ్యవసాయానికి చేసిన సాయం అంటూ అన్నీ దొంగలెక్కలే చెప్పారు'' అని ఆరోపించారు. 

''జగన్ రెండేళ్ల పాలనలో ఏడుసార్లు తుఫాన్లు వచ్చాయి. ఇక అకాలవర్షాలు సరేసరి. వాటివల్ల నష్టపోయిన రైతాంగానికి ఇన్ పుట్ సబ్సిడీ, పంటల భీమా రూపంలో జగన్ ప్రభుత్వం ఎంతసాయం చేసింది? చంద్రబాబు హాయాంలో హెక్టారుకి రూ.20వేలిస్తే, జగన్ దాన్ని రూ.16వేలకు కుదించాడు. రైతు భరోసా పేరుతో ప్రతి రైతుకి రూ.13,500ఇస్తానని చెప్పి రూ.7,500లతో సరిపెట్టాడు'' అని తెలిపారు.

read more  తాచెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు...: సీఎంలకు జగన్ లేఖపై అచ్చెన్న సెటైర్లు 

''రైతు భరోసా చెల్లించాల్సి వస్తుందని  రైతుల సంఖ్యను కూడా ఈముఖ్యమంత్రి 64లక్షలనుంచి 41లక్షలకు కుదించాడు. ఇక యాంత్రీకరణ పరికరాలు, సూక్ష్మ పోషకాలు, భూసార పరీక్షలనేవి ఈ ప్రభుత్వంలో ఎక్కడా కనిపించడం లేదు. ముఖ్యమంత్రి చెప్పిన రూ.3వేలకోట్ల ధరల స్థిరీకరణ నిధి ఏమైంది? వరి, పత్తి, మిర్చిసహా, ఏఒక్క పంటకైనా వైసీపీప్రభుత్వంలో గిట్టుబాటు  ధర లభించిందా?'' అని ప్రశ్నించారు.

''తన క్విడ్ ప్రోకో కోసమే అమూల్ సంస్థను రాష్ట్రంలోకి తీసుకొచ్చాడు. అన్ని డెయిరీలకంటే లీటర్ పాలకు అమూల్ సంస్థ తక్కువ ధర చెల్లిస్తున్నా పాలు వారికే పోయాలంటున్నాడు ముఖ్యమంత్రి.     ఈ విధంగా అన్నిరకాలుగా రైతులను మోసగించిన జగన్మోహన్ రెడ్డి పుస్తకాల్లో అన్నదాతలను ఉద్ధరించాననడం సిగ్గుచేటు'' అని నిమ్మల మండిపడ్డారు.