Asianet News TeluguAsianet News Telugu

తాచెడ్డ కోతి వనమంతా చెరిచినట్లు...: సీఎంలకు జగన్ లేఖపై అచ్చెన్న సెటైర్లు

కోవిడ్ వ్యాక్సిన్ కు అంతర్జాతీయంగా భారీఎత్తున డిమాండ్ ఉన్న నేపథ్యంలో గ్లోబల్ టెండర్ల పేరుతో సిఎం సమయాన్ని వృధా చేశారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెనాయుడు. 

atchannaidu satires on Jagan writes to all CMs on vaccine  akp
Author
Amaravati, First Published Jun 4, 2021, 9:44 AM IST

అమరావతి: కరోనా సమయంలో ప్రజలకు సంజీవిని అయిన వ్యాక్సిన్ కు కూడా కులముద్ర వేసి చివరకు రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్ ఇవ్వడంలో ముఖ్యమంత్రి జగన్ విఫలమయ్యాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెనాయుడు ఆరోపించాడు. అలాంటిది ఆయన ఇప్పుడు ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులకు లేఖ రాయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కోవిద్ వ్యాక్సిన్ కు అంతర్జాతీయంగా భారీఎత్తున డిమాండ్ ఉన్న నేపథ్యంలో గ్లోబల్ టెండర్ల పేరుతో సిఎం సమయాన్ని వృధా చేశారని... తాచెడ్డ కోతి వనమంతా చెరిచినట్లుగా జగన్ వ్యవహారశైలి ఉందని అచ్చెన్న ఎద్దేవా చేశారు. 

''రాష్ట్రంలో కరోనా ఉద్ధృతికి కారణం జగన్మోహన్ రెడ్డి. వ్యాక్సినేషన్ లో వెనుకబడటానికి కారణం జగన్ కాదా?  ఇప్పుడు టెండర్లు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదని గగ్గోలు పెడుతున్నారు. వ్యాక్సిన్ కోసం దేశంలోని ఎన్నో రాష్ట్రాలు ముందుచూపుతో అడ్వాన్స్ లు చెల్లించి మరీ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చాయి.18 నుంచి 45 సంవత్సరాల వయసు వారికి వ్యాక్సిన్ వేసేందుకు రూ. 1600 కోట్లు అవసరం కాగా మే 5న జరిగిన మంత్రివర్గ సమావేశంలో రూ.45 కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారు'' అన్నారు.

read more  అన్నింట్లో దోపిడియే... వ్యాక్సినేషన్‌లో అట్టడుగున ఏపీ: జగన్‌పై చంద్రబాబు విమర్శలు

''వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నపుడు కంపెనీలను సంప్రదించకుండా డిమాండ్ పెరిగిన తర్వాత ముఖ్యమంత్రి లేఖలు రాయడం వాస్తవం కాదా? లేఖలతో వ్యాక్సిన్ వస్తుందా? అసమర్థతను, వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి జగన్ మోహన్ రెడ్డి లేఖల పేరుతో రాజకీయం చేస్తున్నారు.  మన ముఖ్యమంత్రి జగన్ మాత్రం కంపెనీలకు ఒక లేఖ రాసి మాట్లాడకుండా కూర్చున్నారు'' అని తెలిపారు. 

''ఎపి లో కరోనా చేసిన వినాశనం కన్నా జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిన విధ్వంసమే అతిపెద్దది. కరోనాతో సహజీవనం చేయాల్సిందేనని ఇటీవల అసెంబ్లీలో కూడా ముఖ్యమంత్రి చెప్పడం ప్రజారోగ్యంపై ఆయన నిర్లక్ష్యానికి నిదర్శనం. కరోనాను ఎదుర్కోవడంలో జగన్ రెడ్డి వైఫల్యం కారణంగా ఇప్పటికే 16లక్షల మంది వ్యాధిబారిన పడ్డారు, 10వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కరోనా నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వకుండా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష తీర్చుకోవడంపైనే శ్రద్ధ చూపారు. ప్రతిపక్షాలను అణచివేయడంలో చూపిన శ్రద్ధ కరోనా నియంత్రణపై పెట్టి ఉంటే ఇన్నివేల మంది ప్రజలు బలయ్యేవారా?'' అని అచ్చెన్న మండిపడ్డారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios