వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత నిమ్మల రామానాయుడు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీలను అణగదొక్కాలని చూస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్లో తన అధికారంలో ఉండాలంటే తెలుగుదేశంను నిర్వర్యం చేయాలనే ఆలోచనతోనే ఫ్యాక్షన్ మొదలు పెట్టారని నిమ్మల విమర్శించారు.

పార్టీకి వెన్నుముకగా ఉన్న బీసీలను నిర్వర్యం చేస్తేనే తెలుగుదేశం పార్టీ నిర్వర్యం అవుతోందని బీసీలపై కక్షపూరితంగా వ్యవహారిస్తున్నారని రామానాయుడు ధ్వజమెత్తారు. బీసీ కులంలో ఉన్న 139మంది కులాలకు 139 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

కానీ ఈ రోజు 139మంది సామాజిక వర్గాలకు సంబంధించిన కుల పెద్దలను జైలుకు పంపే ప్రయత్నం చేస్తున్నారని నిమ్మల ఆరోపించారు. ఈ రోజు అంబేడ్కర్ రాజ్యాంగం బదులు పులివెందుల రాజ్యంగం అమలు అవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

జగన్మోహన్  రెడ్డి 16నెలలు జైలు లో ఉన్నారు కాబట్టి అతను ప్రశ్నించిన అందరిని జైలుకు పంపించాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ ప్రలోబాలకు,బెదిరింపులకు లొంగితే తాడేపల్లిలో పార్టీ కండువా కప్పుతారని..  తొంగకపోతే ఏసీబీదాడులు, కక్షలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రకాశం జిల్లా మాజీ మంత్రి మైనింగ్ పై ఏసీబీ దాడులు, బెదిరింపులు చేసి మీ పార్టీలోకి చేర్చుకున్న తరువాత వారి పై ఉన్న కేసులు మాయమైయ్యాయని ఆయన గుర్తుచేశారు. ఈఎస్ ఐ స్కాం లో విజిలెన్స్ ఎంక్వైరీలో పితాని, అచ్చెన్నాయుడు పేర్లు లేవని... మరి ఎలా అరెస్ట్ చేస్తారని రామానాయుడు ప్రశ్నించారు.

పరిటాల హత్య కేసులో ఎఫ్ ఐ ఆర్ లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా ఉందని.. కానీ ఇంత వరకు అరెస్ట్ చేయలేదని ఎద్దేవా చేశారు. కానీ ఇవాళ విచారణ లేకుండా అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను ఎలా అరెస్ట్ చేశారని రామానాయుడు నిలదీశారు. స్ధానిక సంస్థల్లో బీసీలకు ఉన్న రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని ఆయన దుయ్యబట్టారు.