కాపులపై అసెంబ్లీ తీర్మానం చెల్లదు..బాంబు పేల్చిన టిడిపి ఎంఎల్ఏ

Tdp mla krishnaiah says assembly resolution on kapu reservation is not valid
Highlights

  • తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ ఆర్ కృష్ణయ్య కాపులను బిసిల్లోకి చేరుస్తూ చేసిన తీర్మానంపై పెద్ద బాంబునే పేల్చారు.

తెలుగుదేశంపార్టీ ఎంఎల్ఏ ఆర్ కృష్ణయ్య కాపులను బిసిల్లోకి చేరుస్తూ చేసిన తీర్మానంపై పెద్ద బాంబునే పేల్చారు. కాపులను బిసిల్లోకి చేరుస్తూ శుక్రవారం మంత్రివర్గం తీర్మానం చేసిన విషయం అందరికీ తెలిసిందే. జస్టిస్ మంజూనాధ కమీషన్ నివేదికను ఆమోదించిన మంత్రివర్గం అదే నివేదికను శనివారం అసెంబ్లీలో కూడా చర్చకు పెట్టింది. అంటే, అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి అమలు కోసం కేంద్రానికి పంపాలన్నది చంద్రబాబునాయుడు ఆలోచన. మంత్రివర్గం ఆమోదించినంత మాత్రాన, అసెంబ్లీలో తీర్మానం చేసినంత మాత్రాన కాపులు బిసిల్లో చేరిపోరు. రిజర్వేషన్ల అంశం కేంద్రప్రభుత్వ పరిధిలోనిది. కాబట్టే కాపులను బిసిల్లోకి చేర్చటం అన్న అంశాన్ని చంద్రబాబు కేంద్రంపైకి నెట్టేశారు.

అదే విషయమై తెలంగాణా టిడిపి ఎంఎల్ఏ, బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య పెద్ద బాంబునే పేల్చారు. రిజర్వేషన్లను రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా రాజకీయ లబ్ది కోసమే ఓటు బ్యాంకుగా మారుస్తున్నట్లు ఆరోపించారు. కాపులను బీసీ జాబితాలో చేర్చాలనేది పూర్తిగా టెక్నికల్ అంశంగా పేర్కొన్నారు. మంజునాథ కమిషన్ రిపోర్ట్ పై ఓపెన్ డిబేట్ పెట్టాలని డిమాండ్ చేసారు. అలా కాకుండా అప్పటికప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసేస్తే అది చట్టపరంగా చెల్లదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు.

బోయలు చాలా పేదరికంలో ఉన్నారు కాబట్టి వాళ్లను బీసీల్లో కలపడంలో తమకు ఎటువంటి అభ్యంతరం లేదన్నారు. బీసీల జనాభా తెలుగు రాష్ట్రాలో 52 శాతమైనా రిజర్వేషన్లు మాత్రం 20 శాతమే అంటూ వాపోయారు.  కాపులలో పేదరికంలో ఉన్నారు కాబట్టి వారికి రిజర్వేషన్లు కావాలంటున్నారనటంలో అర్ధం లేదన్నారు. అసలు రిజర్వేషన్లది పేదరిక నిర్మూలన పథకం కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రాతినధ్యం లేని కులాలకు రిజర్వేషన్లు పెట్టాలని స్పష్టం చేసారు. అంతేకాని ఏపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో కాపులకు రిజర్వేషన్ల అమలు సాధ్యం కాదన్నారు.

 

loader