టీడీపీ సీనియర్ నేత, విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 3వ తేదీన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం దాదాపుగా ఖాయమైనట్లుగా తెలుస్తోంది.

ఆ రోజు గంటా శ్రీనివాసరావు.. ఏపీ సీఎం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిని కలవనున్నారు. నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జ్, కుమారుడు రవితేజను జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చబోతున్నట్లుగా ఇప్పటికే సమాచారం అందుతోంది. విశాఖ నార్త్ వైసీపీ ఇన్‌ఛార్జ్ కేకే రాజుకు అమరావతి నుంచి పిలుపొచ్చింది.

సెప్టెంబర్ 27న ఏపీలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు అధ్యక్షులను నియమించింది టీడీపీ. అయితే, ఈ 25 లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి కాకపోయినా కనీసం విశాఖ, విజయనగరం, అనకాపల్లి లాంటి నియోజకవర్గాలకు అధ్యక్షులను ఎంపిక చేసేందుకు నిర్వహించిన సమావేశంలో గంటా శ్రీనివాసరావు లేరు.

అలాగే, విశాఖ దక్షిణ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఇటీవల టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆయన ప్రత్యక్షంగా పార్టీ కండువా కప్పుకోకపోయినా, గణేష్ కుమారులకు సీఎ వైఎస్ జగన్ వైసీపీ కండువాలను కప్పారు.

దీనిపై చర్చించేందుకు నిర్వహించిన టీడీపీ సమావేశంలో కూడా గంటా శ్రీనివాసరావు కనిపించలేదు. గంటా వైసీపీలో చేరుతున్నట్టు ఈ ఏడాది ఆరంభం నుంచి పలు డేట్లు తెరపైకి వచ్చాయి.